వరద ముప్పునకు శాశ్వత చర్యలు చేపట్టాలి…

హైదరాబాద్‌ నగరం చిన్నపాటి వర్షానికే జలమయమవుతోంది. రోడ్లపై వరద ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. గంటల తరబడి వాహనదారులు సతమతమవుతున్నారు. కొన్ని చోట్ల వరద నీటిలో కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోతున్నవి చూస్తూనే ఉన్నాం. అన్నిటికంటే ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్నది. నాలాల్లో పడి చిన్నారులు చనిపోవడం అత్యంత బాధాకారం. జనాభా పెరుగు తున్న కొద్దీ సౌకర్యాలు కూడా మెరుగు పర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. వర్షం వచ్చిన ప్రతిసారి అడపాదడపా చర్యలు తీసుకుంటున్నారే తప్ప శాశ్వత పరిష్కారం దిశగా పాలకులు ఆలోచించడం లేదు. చిన్నపాటి వర్షాలకే నగరం అతలాకుతలమై ప్రజలు బయటకు వెళ్లాలని పరిస్థితి ఉంటోంది.విద్యుత్‌ స్తంభాలు విరగడం, చెట్లు కూలడం వంటి ఘటనలతో కాలనీల ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. ఇండ్లలోకి కూడా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ఇలాంటి వరద పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నాటి నీటిపారుదల రంగ నిపుణులు 1997, 2000 సంవత్సరాలలో చెరువుల పరిస్థితిని అధ్యయనం చేశారు. 30 చెరువులను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అందుకను గుణంగా సఫిల్‌గూడ, సరూర్‌ నగర్‌, లంగర్‌ హౌజ్‌ చెరువులను అభివృద్ధి చేయడంతో వరద వల్ల వాటికి ఎలాంటి ముప్పు ఏర్పడటం లేదు. హైదరాబాద్‌లో దాదాపు 400 చెరువులు పై నుంచి కింది వరకు అనుసంధానించబడి ఉన్నాయి. నీరు ఒక చెరువు నుండి మరొక చెరువుకు ప్రవహించాలి. నీటి ప్రవాహ మార్గంలో అభివృద్ధి చేయబడిన నిర్మాణాలు ఒక చెరువు నుంచి మరొక చెరువుకు చేరకుండా అంతరాయంగా ఉంటున్నవి. ముందు చెరువులను అభివృద్ధి పరచాలి. అలాగే ఆకస్మిక వరదల్ని అరికట్టడానికి ఫీడర్‌ ఛానెల్‌లు, కాలువల్ని అభివృద్ధి చేయడం పరిష్కార మార్గం. ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
– దండంరాజు రాంచందర్‌ రావు, 9849592958