విద్యార్థులకు ‘దసరా కానుక’

'Dasara gift' to students– అక్టోబర్‌ 24 నుంచి ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’
– సర్కారు బడుల్లో 1 నుంచి 10వ తరగతి పిల్లలకు అమలు
– మరో చారిత్రక నిర్ణయం : సీఎం కేసీఆర్‌
– ముఖ్యమంత్రికి సబిత కృతజ్ఞతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వ దసరా కానుక ప్రకటించింది. సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన సీఎం కేసీఆర్‌ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ, విద్యార్థుల సంక్షే మానికి పాటుప డుతున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు విద్యార్థుల సంక్షేమం దిశగా మరో చారిత్రక నిర్ణయం తీసు కున్నది. దసరా కానుకగా వచ్చేనెల 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ”ముఖ్యమంత్రి అల్పాహార పథకం” అందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. తద్వారా విద్యార్థులకు చక్కని బోధనతోపాటు మంచి పోషకాహారం అందించే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుంది. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యా ర్థులకు పౌష్టి కాహారం అందిం చడంతోపాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చర్యలు చేపట్టింది. ఉదయాన్నే వ్యవసాయ పనులు, కూలీపనులు చేసుకోవడానికి వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్‌ మానవీయ ఆలోచనకు అద్దంపట్టే దిశగా ఈ అల్పాహారం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం దసరా నుంచి అమలు చేయనున్నది.
తమిళనాడులో విజయవంతంగా అమలు
తమిళనాడులో విజయవంతంగా అల్పాహారం పథకం అమలవుతున్నది. ఆ పథకం విధానాన్ని పరిశీలించి రావాలంటూ ఐఏఎస్‌ అధికారుల బృందాన్ని సీఎం కేసీఆర్‌ ఇటీవలే అక్కడకు పంపించారు. కాగా అక్కడ విజయవంతంగా అమలవుతున్న ‘విద్యార్థులకు అల్పాహారం పథకం’ను అధ్యయనం చేసిన అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదిక అందించింది. తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే అమలు చేస్తున్నారనే విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తెచ్చింది. కాగా విద్యార్థుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించే కేసీఆర్‌ ఖర్చుకు వెనకాడకుండా ఉన్నత పాఠశాలల విద్యార్థులకూ అల్పాహారం అంద జేయాలని నిర్ణయించారు. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ప్రతి ఏటా దాదాపు రూ. 400 కోట్ల వరకు అదనపు భారం పడనున్నదని ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాష్ట్రంలోని 28,807 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 23,05,801 మంది విద్యార్థులకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ వర్తించనుంది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు.
స్వాగతించిన టీఎస్‌యూటీఎఫ్‌
ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని టీఎస్‌యూటీఎఫ్‌ సంపూర్ణంగా స్వాగతించింది. వచ్చేనెల 24 నుంచి ప్రభుత్వ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు విడుదల చేయడం హర్షణీయమని టీఎస్‌యూటీఎఫ్‌ అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి తెలిపారు. ఉదయం ఖాళీ కడుపుతో బడికి వచ్చే పలువురు పేద విద్యార్థుల ఆకలి తీర్చే ఈ పథకాన్ని పకడ్బందీగా శాశ్వతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అల్పాహార పథకం ఒక వరమని సీపీఎస్‌ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం అధ్యక్షులు దాముక కమలాకర్‌, ప్రధాన కార్యదర్శి చీటీ భూపతిరావు పేర్కొన్నారు.
ఈ పథకాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు అల్పాహార పథకం అందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడం పట్ల బాలల హక్కుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండు కిష్టయ్య, ప్రధాన కార్యదర్శి రఘునందన్‌ హర్షం ప్రకటించారు.