చరిత్రను వక్రీకరిస్తే ద్రోహులుగా మిగులుతారు

If you distort history, you will remain as traitors– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
– మారుపేరుతో బీఆర్‌ఎస్‌ గందరగోళపరుస్తోంది : పోతినేని
– బీజేపీ వక్రీకరిస్తోంది : చెరుపల్లి
– త్యాగాల వారసులు కమ్యూనిస్టులే : జిల్లాల్లో సాయుధ పోరాట వార్షికోత్సవ ముగింపు సభల్లో సీపీఐ(ఎం) నేతలు
నవతెలంగాణ – భద్రాచలం/విలేకరులు
వీర తెలంగాణ సాయుధ పోరాట వాస్తవ చరిత్రను వక్రీకరిస్తే చరిత్ర ద్రోహులుగా మిగులుతారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. చరిత్రను వక్రీకరిస్తూ మతకల్లోలాలు సృష్టించే శక్తులను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పిలుపునిచ్చారు. ఆదివారం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జరిగిన సభల్లో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం గోదావరి బ్రిడ్జి నుంచి అన్నపూర్ణ ఫంక్షన్‌ హాల్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించి అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడారు.
సెప్టెంబర్‌ 17 తెలంగాణ సాయుధ పోరాటం గురించి బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు మాట్లాడుతున్నాయని, నిజంగా ప్రజలకు వాస్తవ చరిత్ర తెలియచేయాలనే ఉద్దేశం వారికుంటే తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర కమ్యూనిస్టుల త్యాగాల చరిత్ర అని ఒప్పుకునే దమ్ము ఆ పార్టీలకు ఉందా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వీర తెలంగాణ సాయుధ పోరాట నిజమైన వారసులుగా వాస్తవ చరిత్రను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల మీద ఉందని స్పష్టంచేశారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం సాగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో 4000 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు తమ ప్రాణాలర్పించి నిజాం గడీలను బద్దలు కొట్టి మూడువేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలను స్థాపించారని, 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేశారని గుర్తుచేశారు. విమోచన దినం పేరుతో ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువులు పోరాడిన చరిత్రగా బీజేపీ మసిబూసి మారేడు కాయ చేస్తుందని విమర్శించారు. నాటి నిజాం పరిపాలనలో కులం, మతం అనే అంశాలకు తావు లేదని, భూమి, వెట్టి, మాతృభాషలో విద్య లాంటి అంశాల చుట్టే తెలంగాణ ప్రజలు పోరాటాలు చేశారని గుర్తుచేశారు. ఈ పోరాటంలో ప్రాణాలర్పించిన వారిలో హిందువులు, ముస్లింలు ఉన్నారని అలాగే ప్రజలను హింసించిన వారిలో కూడా ముస్లింలు, హిందువులు ఉన్నారని తెలిపారు. అలాగే, నిజాం నవాబు దాష్టీకానికి బలైన కమ్యూనిస్టు కార్యకర్తల కంటే నెహ్రూ, పటేల్‌ సైన్యం పంపించిన సైన్యం దాడిలో మరణించిన కమ్యూనిస్టు కార్యకర్తలే ఎక్కువమంది ఉన్నారని, అందుకే కాంగ్రెస్‌కు దీనిపై మాట్లాడే అర్హత లేదన్నారు. నిజంగా నెహ్రూ సైన్యంను.. నిజాం రాజును గద్దె దించడానికి పంపించినట్లయితే రాజభరణం పేరుతో నిజాం రాజుకు ఎందుకు ఊడిగం చేశారని ప్రశ్నించారు. పేద ప్రజలందరికీ భూమి దక్కేవరకు పోరాటాలు నిర్వహించడమే వీర తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు ఇచ్చే ఘనమైన నివాళి అని తెలిపారు.
చరిత్రను వక్రీకరిస్తున్న బీఆర్‌ఎస్‌ : పోతినేని
జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు జరుపుతున్న బీఆర్‌ఎస్‌ వీర తెలంగాణ వాస్తవ చరిత్ర ప్రజలకు తెలియజేయకుండా మారుపేరుతో ప్రజలను గందరగోళపరుస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ విమర్శించారు. తెలంగాణ ఏర్పడితే అధికారికంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు జరుపుతానని ప్రగల్బాలు పలికిన కేసీఆర్‌ వీర తెలంగాణ అనే పేరు కూడా పలకడానికి భయపడుతూ జాతీయ సమైక్యత దినోత్సవం అనివీర తెలంగాణ సాయుధ పోరాటం మిగిల్చిన కర్తవ్యాలు ఇంకా మిగిలే ఉన్నాయని, అందులో ప్రధానమైన అంశం భూ పంపిణీ అని, భవిష్యత్‌లో భూమిలేని పేదల తరఫున భూ పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సీనియర్‌ నాయకులు కాసాని ఐలయ్య, ఎలమంచి రవికుమార్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏజే రమేష్‌, కొక్కెరపాటి పుల్లయ్య, ఎంబీ నర్సారెడ్డి, కె.బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.
నిజమైన వారసులు కమ్యూనిస్టులు : చెరుపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట దినోత్సవ సభకు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు హాజరై మాట్లాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను బీజేపీ ప్రభుత్వం వక్రీకరిస్తున్నదన్నారు. నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని అన్నారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట దినోత్సవానికి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి హాజరై అమరవీరులకు నివాళులర్పించారు. సాయుధ రైతాంగ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని అన్నారు. మిర్యాలగూడ పట్టణకేంద్రంలో సాయుధపోరాట దినోత్సవం సభలో అఖిల భారత కిసాన్‌సభ జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు.
బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఓడించండి :ఎండీ అబ్బాస్‌
జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌ మాట్లాడుతూ.. సాయుధపోరాట స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో బూర్జువ, భూస్వామ్య పార్టీలైన బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారసులు కమ్యూనిస్టులేనని, కానీ బీజేపీ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు ముందు జనగామ బస్టాండ్‌ నుంచి నెహ్రూ పార్క్‌ మీదుగా కామాక్షి ఫంక్షన్‌ హాల్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
బీజేపీని గద్దె దించడమే లక్ష్యం : డీజీ
హైదరాబాద్‌లోని కాచిగూడ కృష్ణా నగర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిర్వహించిన సభలో సీపీఐ(ఎం) కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింగరావు పాల్గొని మాట్లాడారు. బ్రిటిషర్ల మోచేతు నీళ్లు తాగి ఏ సంబంధం లేని వాళ్ళు ఇప్పుడు సాయుధ పోరాటంలో పోరాడినట్టు నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాఉ. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపే వరకు పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారులు పోరాడాలని పిలుపునిచ్చారు.
ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్న బీజేపీ : టి.జ్యోతి
నిర్మల్‌లో నిర్వహించిన సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.జ్యోతి మాట్లాడుతూ.. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 1946 జులై 4న దొడ్డి కొమరయ్య అమరత్వంతో మొదలైన తెలంగాణ సాయుధ పోరాటం 1951 సెప్టెంబర్‌17 వరకు సుదీర్ఘకాలం నైజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిందన్నారు. నాటి తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో బీజేపీ, సంఫ్‌ు పరివార్‌ శక్తులకు ఎలాంటి పాత్ర లేదన్నారు. హైదరాబాద్‌ సంస్థానం విలీనం గురించి మాట్లాడుతున్న బీజేపీ నాయకులు దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్న ఇతర సంస్థానాల విలీనం గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. జాతీయ ఉద్యమంలో బ్రిటిష్‌ వారి అడుగులకు మడుగులొత్తిన బీజేపీ నాయకులు నేడు దేశభక్తులమని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నైజాం ఫ్యూడల్‌ పాలనలో జమీందార్లు, జాగిర్దార్లు అనేక మంది హిందువులనే విషయం బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యం. అడివయ్య, బుర్రి ప్రసాద్‌, జిల్లా కార్యదర్శి గౌతమ్‌ కృష్ణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం నూతన్‌ కుమార్‌, బి.సుజాత, జిల్లా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.