– సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు నీరటి మల్లేష్
– అధికారులు వైఖరి మార్చుకోవాలని హితవు
నవతెలంగాణ-శంషాబాద్
అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు నీరటి మల్లేష్ అన్నారు. మంగళవారం శంషాబాద్ మండల పరిధిలోని నర్కూడ గ్రామం నుంచి అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు కందుకూరులో మంగళవారం జరిగే సమ్మె కార్యక్రమానికి వెళుతున్న సమయంలో ఆయన మాట్లాడారు. 20 ఏండ్లుగా అంగన్‌వాడీలు చాలీచాలని వేతనాలతో అదనపు పని భారంతో కేంద్రాలను నడిపిస్తున్నారన్నారు. వేతనాలు పెంచకుం డా ప్రభుత్వం వివిధ రకాల పని ఒత్తిడి వారి మీద రుద్ది బలవంతంగా పనులు చేయించుకుంటుందని మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న హక్కులను అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నా రన్నారు. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నా రు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అధికారులు బలవంతంగా కేంద్రాలను తెరిపించి అంగన్‌వాడీ టీచర్లను, హెల్పర్లను భయభ్రాంతులకు గురి చేస్తే సహించేది లేదన్నారు. పలు డిమాండ్లతో కూడిన పత్రాన్ని గ్రామ సర్పంచ్ సిద్ధులుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జి. విక్రమ్ కుమార్, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు మల్లేశ్వరి, నళిని, అమూల పాల్గొన్నారు.