కాంగ్రెస్‌వి బోగస్‌ హామీలు

– ప్రజలను మోసగించడం కాంగ్రెస్‌కు అలవాటు
– రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలతో అధికారంలోకి వచ్చేది ఉందా..ఇచ్చేది ఉందా అన్న తరహాలో బోగస్‌గా ఉన్నాయని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు.సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.తుక్కగూడ బహిరంగ సభలో కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన హామీలన్ని బోగస్‌వేనన్నారు.ప్రజలను మోసగించడం కాంగ్రెస్‌కు పరిపాటేనన్నారు.కాంగ్రెస్‌ చరిత్ర ఎప్పుడూ ప్రజల వైపు లేదన్నారు.ఇచ్చిన హామీలు నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్‌కు ఏనాడూ ఉండబోదన్నారు 48 ఏండ్లు పాలించిన తమ పాలనలో దేశంలో ఆకలి దారిద్య్రాలకు కారణం కాంగ్రెస్సేనన్నారు. అధికారం కోసం ఇక్కడి నేతల స్క్రిప్ట్‌ ప్రకారం కాంగ్రెస్‌ అగ్రనేతలు ఇచ్చిన హామీలు బఫూన్‌, బుడ్డర్‌ఖాన్‌లను తలపించేలా ఉన్నాయని ఆరోపించారు.ఎలాగైనా అధికారంలోకి రావాలని రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలనే కాపీ చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.అమలుకు సాధ్యం కానీ అబద్ధపు హామీలు ఇచ్చే అలవాటు కేసీఆర్‌కు లేదని పేర్కొన్నారు.నూటికి నూరు శాతం చెప్పిన అమలు చేసి మేనిఫెస్టోలో చెప్పని పథకాలను సైతం ప్రవేశపెట్టిన నేత కేసీఆర్‌ అన్నారు.కేసీఆర్‌ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు.కాంగ్రెస్‌ వాళ్లు ఏలుతున్న ఏ ఒక్క రాష్ట్రం లో కూడా నిన్న ప్రకటించిన పథకాలు లేవన్నారు.రాష్ట్రానికో మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్‌ చూస్తుందన్నారు.హైదరాబాద్‌లో చెప్పిన హామీలు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అంటూ మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో వారు ఇస్తున్న పెన్షన్లు ఎక్కడా వెయ్యి రూపాయలు కూడా దాటలేదన్నారు.కూట్లే రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీసిన చందంగా ఆ పార్టీ వ్యవహారం ఉందని విమర్శించారు.చైతన్య వంతులైన తెలంగాణ ప్రజల ముందు కాంగ్రెస్‌ పాచికలు పారవన్నారు.మోడీ పాలనతో విసుగు చెంది కేసీఆర్‌ వంటి ప్రత్యామ్నాయం లేనందునే ప్రజలు కర్నాటకలో కాంగ్రెస్‌కు ఓటేశారని తెలిపారు. తెలంగాణ పోరాటాలను కాంగ్రెస్‌ పదేపదే అవమానిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఈ సమావేశంలో నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్థి లింగయ్య, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ చైర్మెన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, జిల్లా పరిషత్‌ వైస్‌చైర్మెన్‌ గోపగాని వెంకటనారాయణ పాల్గొన్నారు.