రష్యాతో మాకున్న సంబంధాలతో మీకేం పని?

What do you have to do with our relationship with Russia?– మక్రాన్‌తో సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడు
మాస్కో : సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌(సీఏఆర్‌), రష్యా దేశాల మధ్యగల సంబంధాలతో ఫ్రాన్స్‌కు సంబంధం లేదని సీఏఆర్‌ అధ్యక్షుడు ఫాస్టిన్‌ అర్చాంగే టోదేరా ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌తో అన్నాడని ఫ్రెంచ్‌ ప్రభుత్వ వార్తా సంస్థ ఓ రిపోర్టులో పేర్కొంది. క్యూబాలో జరగనున్న జీ-77 శిఖరాగ్ర సమావేశానికి వెళుతూ బుధవారంనాడు మక్రాన్‌ను ప్యారిస్‌లో కలిసినప్పుడు టోదేరా ఇలా వ్యాఖ్యానించినట్టు ఆ వార్తా సంస్థ పేర్కొంది. రెండు దేశాల మధ్య రక్షణ, శిక్షణ సంబంధిత ఒప్పందం అమలులో భాగంగా సిఏఆర్‌ రష్యకు సహకరిస్తోందని, దీనిలో వ్యాపారం ఏమీ లేదని ఆ దేశ అధ్యక్షుడు అన్నారు.
రష్యాతో సహకరించటం, వాగర్‌ గ్రూపు సీఏఆర్‌ లో కార్యకలాపాలను నిర్వహించటంవల్ల ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్దరించటం కోసం గతవారం ఫ్రెంచ్‌ అధ్యక్షుడు మక్రాన్‌ టోదేరాను కలిశారు. సార్వభౌమాధికారాన్ని పరస్పరం గౌరవిం చటం, స్థిరత్వం కోసం పనిచేయటం, సానుకూల వాతా వరణంలో చర్చలను జరపటంవంటి విషయాలపైన కలిసి పనిచేయాలని ఇరుదేశాల నాయకులు అంగీకరిం చారని ఫ్రెంచ్‌ ప్రెసిడెంట్‌ ఆఫీస్‌ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఫ్రాన్స్‌తో బలమైన సంబంధాలను కలిగివుండటానికి టోదేరా తన మద్దతు పలుకుతూ రష్యాతో కూడా భాగస్వామ్యం ఉంటుందని చెప్పాడు. మాలి, బర్కినా ఫాసోతో సహా సెంట్రల్‌ ఆఫ్రికన్‌ దేశాల భద్రతకు రష్యా నమ్మకమైన భాగస్వామిగా ఉందని ఆయన అన్నాడు. అనేక సంవత్సరాలుగా అఫ్రికాలోని మాజీ వలస దేశాల అంతర్గత విషయాలలో ఫ్రాన్స్‌ జోక్యం చేసుకుంటోందనే ఆరోపణలు ఉన్నాయి. సాహేల్‌ ప్రాంతంలో జిహాదిస్టు తిరుగుబాట్లను ఎదుర్కోవటంలో ఫ్రెంచ్‌ సైన్యం విఫలమైందనే విమర్శ ఉంది. ఈ సంవత్సరం జులై నెలలో నైజర్‌లో జరిగిన తిరుగు బాటులో అధికారం కోల్పోయిన మహమ్మద్‌ బజోమ్‌కు అనుకూలంగా నయావలసవాదాన్ని కొనసాగి ంచటం కోసం ఫ్రాన్స్‌ జోక్యం చేసుకుంటోందన్న విమర్శ ఉంది. ఈ నేపధ్యంలో ఒక ఫ్రెంచ్‌ వలస దేశంగా సీఏఆర్‌ తన సార్వభౌమత్వాన్ని రక్షించుకోవటానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తుందని ఆ దేశ అధికార ప్రతినిధి చెప్పారు.