సుశీపేట న్యూట్రిషన్‌ కంపెనీ మాకొద్దు

నవతెలంగాణ-నర్సాపూర్‌
శివ్వంపేట మండలంలోని నవాబ్‌ పేట గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న సుశీపేట న్యూట్రిషన్‌ కంపెనీపై జిల్లా కలెక్టర్‌ రాజర్శి షా, నర్సాపూర్‌ ఆర్డీఓ శ్రీనివాస్‌, రామచంద్రపురం పీసీబీ అధికారులకు పిర్యాదు చేసినట్లు రైతుసమన్వయ సమితి గ్రామకమిటీ అధ్యక్షులు రంగ సురేష్‌ గౌడ్‌, నాయకులు చెరుకుపల్లి నర్సింహారెడ్డి, చింతల మహేష్‌ బుధవారం తెలిపారు. గతంలో సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని కానుకుంట శివారులో ఇదే కంపెనీ ఉండగా దానిని అక్కడి గ్రామస్తులు వ్యతిరేకించగా, ఇదే అదునుగా భావించిన కంపెనీ యాజమాన్యం పక్కనే గల నవాబ్‌ పేట్‌ శివారులోకి తరలించి గ్రామానికి తీవ్రంగా అన్యాయం చేయాలని అక్రమంగా కంపెనీ నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. నవాబ్‌ పేట్‌ గ్రామశివారులోని సర్వేనెంబర్‌ 241,242లలో సుమారు 10ఎకరాలలో ఎలాంటి అనుమతులు లేకుండా సుశీపేట నూట్రి సైన్స్‌ పేరుతో కంపెనీ నిర్మాణం అన్యాయమని వారన్నారు. కంపెనీ పక్కనే గల సర్వే నెంబర్‌ 244లో గల సుమారు 5 ఎకరాల అసైండ్‌ మెంట్‌ భూమిని కూడ నిబంధనలకు విరుద్దంగా కంపెనీ యాజమాన్యం కొనుగోలు చేశారని మండిపడ్డారు. రెవిన్యూ అధికారులు, పీసీబీ, మైనింగ్‌, గ్రౌండ్‌ వాటర్‌ అధికారులకు కూడ సుశీపేట న్యూట్రిషన్‌ సైన్స్‌ కంపెనీపై పిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.