– కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్ యాదవ్
– కడ్తాల్ మండల కేంద్రంలో సాయిచంద్
– చిత్రపటానికి ఘన నివాళి
నవతెలంగాణ-ఆమనగల్
తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకులు సాయిచంద్ జయంతి వేడుకలను బుధవారం కడ్తాల్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్ యాదవ్ హాజరై మాట్లాడారు. అంబేద్కర్ వాదిగా సమసమాజ స్థాపన కోసం జరిగిన ఉద్యమాల్లో తన వంతు కలం, గళం భాగ్యస్వామ్యం చేసిన సాయిచంద్ ఈరోజు మనమధ్య లేకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే కళాకారుడిగా, గాయకుడిగా మంచి పేరు తెచ్చుకొని తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆట పాటలతో ప్రజల్లో ఉద్యమస్పూర్తిని నింపారని ఆయన కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సాధించిన ప్రగతి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తన ఆట పాటలతో చాటి చెప్పిన సాయిచంద్ ప్రతిభను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మెన్‌గా నియమించినట్టు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వివరించారు. అంతకు ముందు స్థానిక నాయకులతో కలిసి సాయిచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వెల్దండ జడ్పీటీసీ విజితా రెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు బాచిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ లాయఖ్ అలి, ఎంపీటీసీ సభ్యులు మంజుల చంద్రమౌళి, నాయకులు బిక్షపతి, నర్సింహ, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.