భారత్-కెనడా మధ్య దిగజారిన సంబంధాల పూర్వరంగంలో కెనడాలో ఉన్న మన పౌరులు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరిక అక్కడ విద్యాభ్యాసం, ఉపాధికోసం వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది. విదేశాల నుంచి వచ్చి చదువుకుంటున్న ఎనిమిదిలక్షల మందిలో నలభై శాతం మనవారే ఉన్నందున తలిదండ్రుల్లో ఆవేదన సహజం. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి వారి భద్రతకు ఎలాంటి ముప్పు లేనప్పటికీ పరిస్థితులు దేనికి దారితీస్తాయో చెప్పలేము. భాయీ – భాయీ అన్నట్లుగా ఇటీవలి వరకు కనిపించిన పరిస్థితి పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించుకోవటం, వాణిజ్య చర్చలను రద్దు చేసుకోవటం వరకు వచ్చింది. సామాజిక మాధ్యమాలు, ఇతరంగా వచ్చిన బెదిరింపుల కారణంగా పరిమిత సిబ్బందితో దౌత్య కార్యాలయాలను నిర్వహించనున్నట్లు మన దేశంలో కెనడా కార్యాలయం ప్రకటించిందంటే తిరిగి పూర్వస్థితి ఎప్పుడు ఏర్పడేది చెప్పలేము. కెనడా పౌరుడు, ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ అనే సంస్థ నేతగా చెప్పుకొనే హరదీప్ సింగ్ నిజ్జర్‌ను జూన్ నెలలో బహిరంగ ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు, దానికి భారత దేశమే బాధ్యురాలని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడేవ్ చేసిన తీవ్ర ఆరోపణ, ఎలాంటి సంబంధం లేని మనదేశం చేసిన ప్రకటన పూర్వరంగంలో ఈ పరిణామాలు వెంటవెంటనే జరిగాయి.
కెనడా రాజకీయాల్లో సిక్కులు ఒక ప్రభావిత శక్తిగా ఉన్నారు. పంజాబ్ తరువాత ప్రపంచంలో సిక్కు సామాజిక తరగతి ఎక్కువగా ఉన్నది కెనడాలోనే, అక్కడ జనాభాలో 2.1శాతం ఉన్నారు. ముప్పై మందితో కూడిన జస్టిన్ ట్రుడేవ్ మంత్రివర్గంలో నలుగురు సిక్కులు మంత్రులుగా ఉన్నారు. ఈ కారణంగా నిజ్జర్ మరణానికి బాధ్యులను తేల్చాలన్న డిమాండ్ సహజంగానే అక్కడ ముందుకు వచ్చింది. అందువలన మరొకదారిలేని పరిస్థితిలో అంతర్జాతీయ కర్తవ్యం సంగతి తరువాత ముందు తన ప్రభుత్వం గురించి చూసుకోవాలని హత్య గురించి ట్రుడేవ్ బహిరంగంగా పార్లమెంటులో చెప్పాల్సి వచ్చింది. భారత్-కెనడా సంబంధాల్లో విబేధాలు జూన్‌లోనే కనిపించాయి. మొదటి వారంలో మన విదేశాంగ మంత్రి జై శంకర్ విలేకర్లతో మాట్లాడుతూ ఖలిస్తాన్ వేర్పాటువాదులకు కెనడా మద్దతు ఇవ్వటం రెండు దేశాల సంబంధాలకు మంచిది కాదని విమర్శించారు. ఆ తరువాత నిజ్జర్ హత్య జరిగింది. ఢిల్లీలో జరిగిన జి-20 కూటమి సమావేశాలకు జస్టిన్ ట్రుడేవ్ వచ్చినప్పటికీ ఇతర దేశాధినేతలతో మాదిరి ఫ్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక చర్చలు జరపలేదు. అంటీ ముట్టనట్లుగా ఉన్నాడు. అంతే కాదు కెనడాలో ఉగ్రవాదులు భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని ఇటీవలి కాలంలో జరిగిన ఉదంతాల గురించి మోడీ కెనడా దృష్టికి తేగా, ప్రతిగా కెనడా కూడా మనదేశం మీద ఆరోపణలు చేసిందని వెల్లడైంది. తిరుగు ప్రయాణంలో ట్రుడేవ్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడగా ప్రత్యామ్నాయంగా విమానం ఏర్పాటు చేస్తామని మన దేశం ప్రతిపాదించినా రెండు రోజులు వేచి ఉండి తన విమానంలోనే వెళ్లిన సంగతి తెలిసిందే. ఏదో పెద్ద తేడా వచ్చిందని అప్పుడే అనేక మంది ఊహించారు.
చేసిన ఆరోపణను కెనడా వెనక్కు తీసుకోవాలని మనదేశం డిమాండ్ చేస్తోంది. మూడునెలల పరిశోధన తరువాత భారత హస్తం ఉందని నిర్థారించుకున్నామని కెనడా అంటోంది. ఈ ఆరోపణను ఉపసంహరించుకుంటే తప్ప మనదేశం వెనక్కు తగ్గదు, అదే జరిగితే అభాసుపాలవుతుంది కనుక కెనడా వెనక్కు తగ్గే అవకాశాలు తక్కువ. ఇండో-పసిఫిక్ ప్రాంత వ్యూహంలో చైనాను నిలవరించేందుకు భారత్‌ను ముందుపీఠీన ఉంచాలన్న అమెరికా కూటమి దేశాల్లో కెనడా కూడా ఒకటి. అలాంటిది భారత్‌తో ఇప్పుడు తలపడటం మంచిది కాదని అమెరికా, ఐరోపాలోని చైనా వ్యతిరేక వ్యూహకర్తలు ఆందోళన వెల్లడిస్తున్నారు. అవసరమైతే కెనడాను పక్కన పెట్టి భారత్‌కు బాసటగా నిలవాలన్న సలహాలు కూడా ఇస్తున్నారు. తాజా పరిణామాలకు ముందు అంతర్గతంగా పెద్ద చర్చే జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల నిఘా సంస్థలతో రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పడిన ”ఐదు కళ్ల” యంత్రాంగం భేటీలో ఖలిస్తానీ నేత హత్య గురించి భారత్‌ను దోషిగా చేయటం ఇండో-పసిఫిక్ ఎత్తుగడలకు నష్టదాయకం గనుక మౌనంగా ఉండాలని కెనడాకు సూచించగా తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. ఇది చినికి చినికి గాలివానగా మారితే సంభవించే పర్యవసానాల గురించి ఆందోళన చెందుతున్న జి-7 కూటమిలో పెద్దన్న అమెరికా, ఇతర దేశాలు జోక్యం చేసుకుంటే చైనా వ్యతిరేక శక్తులను సమీకరించటం ముఖ్యమని భావించి రాజీపడితే టీకప్పులో తుపానులా ముగియవచ్చు. అందుకు కెనడా సిద్దపడుతుందా అన్నది ప్రశ్న.