అంగన్‌వాడీల జేఏసీని చర్చలకు పిలవాలి

JAC of Anganwadis should be called for discussions– ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య
– ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మెన్‌ వినోద్‌కుమార్‌ ఇల్లు ముట్టడి..
– రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె దీక్షలు
నవతెలంగాణ – కరీంనగర్‌/విలేకరులు
ప్రభుత్వం మొండి వైఖరి వీడి అంగన్‌వాడీల జేఏసీని చర్చలకు పిలవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య కోరారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (సీఐటీయూ, ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజుల నుంచి సమ్మె కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కరీంనగర్‌లో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలు ఆదివారం.. శిబిరం నుంచి ర్యాలీగా.. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ వినోద్‌ కుమార్‌ ఇల్లు ముట్టడించారు. కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అంగన్‌వాడీలు అగ్రహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని 14 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం చర్చలకు పిలవకుండా కాలయాపన చేస్తున్నదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య మాట్లాడుతూ.. 14 రోజుల నుంచి అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ప్రభుత్వ అధికారులను అడ్డుకుంటామని తెలిపారు. అంగన్‌వాడీలవి గొంతమ్మ కోరికలు కావని, కొన్నేండ్లుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలే అడుతున్నారని, వెంటనే చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్‌ టవర్‌ సెంటర్‌లో అంగన్‌వాడీలు మానవహారం నిర్వహించారు. మిర్యాలగూడ మండలంలో ఒంటి కాలుపై నిలబడి దండం పెట్టి నిరసన వ్యక్తం చేశారు. దేవరకొండలో సమ్మె కొనసాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండల కేంద్రంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. రాజాపేట మండల కేంద్రంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు మౌనదీక్ష నిర్వహించారు. వికారాబాద్‌ జిల్లా మర్పల్పి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు ఆందోళన చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో చేపట్టిన సమ్మెకు కాంగ్రెస్‌ చౌదరిగూడ మండల అధ్యక్షులు రాజు మద్దతు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, ఇల్లందులో శిబిరం వద్ద చెవిలో పూలుపెట్టుకొని నిరసన తెలిపారు.