వినాయక మండపాల చుట్టూ నేతల ప్రదక్షిణలు

Leaders circumambulate around Vinayaka mandapalas– అడగకపోయినా చందాలిస్తూ ఓటర్లకు గాలం
– ఖర్చులు భరిస్తున్న ఆశావహులు, అభ్యర్థులు
– అభివృద్ధి, హామీలపై పలుచోట్ల స్థానికుల నిలదీత
– ఆవేశాన్ని దిగమింగి.. ప్రశ్నించిన వారి గురించి నేతల ఆరా..
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
‘చిత్తం దేవుడిపై.. భక్తి ఓట్లపై..’ అనే రీతిలో నేతలు వినాయక మండపాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఐదేండ్లలో ఎన్నడూ లేనిది ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గణేశ్‌ నవరాత్రులను అడ్డు పెట్టుకున్నారు. వివిధ గ్రామాల్లో పదుల సంఖ్యలో వెలిసిన వినాయక మండపాలకు వెళ్తూ అడగకపోయినా చందాలు ఇస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే హాట్‌ స్థానంగా ఉన్న పాలేరు నియోజకవర్గంలో పోటాపోటీగా గణేశ్‌ ఉత్సవ కమిటీలకు నేతలు కానుకలు ఇస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఒక్కో మండపానికి రూ.10వేలు, రూ.5వేల చొప్పున నేతలు ఇస్తున్నారు. ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం తదితర నియోజకవర్గాల్లో డీజేలు, కరెంట్‌ సఫ్లరు పర్మిషన్‌ల ఖర్చులను కొందరు నేతలు భరిస్తున్నారు. మరికొందరు అన్నదానం ఖర్చులను ఇస్తున్నారు. వినాయకుని ఖర్చుల భారం మోయలేక కొందరు నేతలు చందాల కోసం వచ్చేవారికి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. గణేశ్‌ నవరాత్రులు ముగిసే వరకు హైదరాబాద్‌లో తలదాచుకునేవారూ ఉన్నారు.
డబ్బుల చుట్టూ రాజకీయాలు..
ఒకప్పుడు అభివృద్ధి, సిద్ధాంతాలు, పాలన తీరు ప్రాతిపదికన ఆదర్శవంతమైన రాజకీయాలు నడిచేవి. కానీ ఇప్పుడు రాజకీయాలను డబ్బు శాసిస్తుందని ప్రజాస్వామ్య వాదులు వాపోతున్నారు. కేవలం పాలేరు నియోజకవర్గంలో ఒక్క గణేశ్‌ మండపాలకు ఓ ఇద్దరు నేతలు సుమారు రూ.2 కోట్ల వరకు ఖర్చు చేశారంటే ఎన్నికలు ఎంత క్లాస్టిలీ అయ్యోయో అర్థం చేసుకోవచ్చంటున్నారు. నియోజకవర్గం లో ఖమ్మం రూరల్‌ 400, తిరుమలాయపాలెం 270, నేలకొండపల్లి 207, కూసుమంచి 180 వరకు గణేశ్‌ మండపాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 1100 విగ్రహాలను ఏర్పాటు చేస్తే ఒక్కో దానికి ఓ నాయకుడు రూ.10వేల చొప్పున ఇస్తే.. మరో నాయకుడు రూ.5వేల చొప్పున మండపం మండపానికి వెళ్లి చందాలు ఇచ్చారు. కుటుంబ సభ్యులు, సన్నిహిత అనుచరులతో ఈ పంపకాలు చేస్తుండటం గమనార్హం. ఇక డబ్బులు అంతగా లేని ఆశావహులు, అభ్యర్థులకు గణేశ్‌ నవరాత్రులు ఓ పెద్ద సవాల్‌గానే మారాయి. వెయ్యి ఓట్లు ఉన్న ఊరులో పది వరకు మండపాలు నెలకొల్పారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అభివృద్ధి, హామీలపై నిలదీత..
కొన్ని చోట్ల గణేశ్‌ మండపాల వద్దకు వెళ్లిన అధికార పార్టీ అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురవుతోంది. స్థానిక సమస్యలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వానలు, వరదలు, పంటనష్టాల సమయంలో రాలేదు కానీ ఎన్నికలు సమీపిస్తు ండటంతో ఇప్పుడు వచ్చారంటూ.. నేతలను నిలదీస్తున్నారు. రోడ్లు, డ్రయినేజీలు లాంటి కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితుల్లో అనేక కాలనీలు ఉన్నాయి. సంక్షేమం విషయం లో వివక్షత చోటుచేసుకోవడంపైనా అడుగుతున్నారు. ఇలాంటి వారి విషయంలో నేతల ఆగ్రహం కట్టలు తెంచుకు ంటున్నా.. ఎన్నికల నేపథ్యంలో మారుమాట్లాడకుండా వెళ్తున్న ఉదంతాలూ ఉన్నాయి. అయితే ఎక్కడ ఎవరు ప్రశ్నించారు? వారి రాజకీయ నేపథ్యం ఏంటి? అనే విషయాలపై ఆరా తీస్తుండటం కనిపించింది.
నాటి ఎమ్మెల్యేలు అభివృద్ధికి కట్టుబడేవారు..
నాటి నేతలు అభివృద్ధికి కట్టుబడేవారు. అప్పట్లో డబ్బులకన్నా పనితీరుకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఓటు విలువ ఆర్థికంగా గణనీయంగా పెరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చే ఇలాంటి తాయిలాలను ఆశిస్తే గెలిచినాక ఆమేరకు కూడబెట్టుకునే పనిలో నేతలు ఉంటారనే విషయాన్ని ప్రజలు గ్రహించాలి.
నున్నా నాగేశ్వరరావు, రైతుసంఘం రాష్ట్ర నాయకులు