– అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల హత్య
– సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
ఇంఫాల్ : మణిపూర్‌లో జులై 6న అదృశ్యమైన ఇద్దరు మొయితీ విద్యార్థులు హత్యకు గురయ్యారు. వారి మృతదేహాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించిన రెండు రోజుల అనంతరం ఈ ఫొటోలు వెలుగులోకి రావడం గమనార్హం. ఆ ఇద్దరు విద్యార్థులను కుకీ సాయుధ దుండగులు అపహరించినట్టు ఆగస్టులో సుప్రీంకోర్టుకు సమర్పించిన స్టేటస్ కో నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న 11 కేసుల్లో ఇదీ ఒకటి. ఫోటోలు వైరలైన వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్‌తో మాట్లాడినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇద్దరు విద్యార్థులను కొంతమంది సాయుధులు కిడ్నాప్ చేసి హత్య చేసినట్టు తెలుస్తోంది. ఒక అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించినట్టు ఒక ఫొటోలో ఉండగా.. వారి వెనుక ఇద్దరు దుండుగులు కన్పించారు. పొదల మధ్యలో విద్యార్థుల మృతదేహాలను పడేసిన మరో ఫొటో కూడా వైరల్ అయ్యింది. ఈ ఫొటోలపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. హత్యకు గురైన విద్యార్థులు.. మొయితీ వర్గానికి చెందిన 17 ఏండ్ల విద్యార్థిని, 20 ఏండ్ల విద్యార్థిగా గుర్తించినట్టు తెలిపింది. జులై 6 నుంచి వీరిద్దరూ అదశ్యమయ్యారు. జులై 19న తన కుమార్తె అదశ్యమైనట్టు విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాంఫెల్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. జులై 6వ తేదీన ఆంక్షలు సడలించడంతో విద్యార్థిని కోచింగ్ కోసం వెళ్లింది. అనంతరం తన స్నేహితుడితో బైక్‌పై వెళ్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. విద్యార్థిని క్లాసుకు హాజరైనట్టు టీచర్ కూడా వెల్లడించారు. చివరిసారిగా వారిద్దరు బిష్ణుపూర్‌లో కనిపించినట్టు సీసీటీవీ ఫుటేజీలో నిక్షిప్తమైంది. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. వారు ఇంఫాల్‌కు సమీపంలోని నంబోల్ వైపు వెళ్లినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యిందని పోలీసులు గతంలో వెల్లడించారు. ఆ తర్వాత వారు అదశ్యమయ్యారు. ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు చేపట్టినట్లు మణిపుర్ ప్రభుత్వం ఆ ప్రకటనలో వెల్లడించింది. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది.