”భారతదేశం నేడు దయనీయంగా మారింది. ఒక మతం వారు ఇతర మతం వారిని బద్ద శత్రువులుగా చూస్తున్నారు. భవిష్యత్తు చీకటిగా కనిపిస్తోంది. ఈ మత రాజకీయాలు దేశాన్ని దెబ్బతీశాయి. ప్రపంచ వేదికపై భారత్‌కు సిగ్గుచేటుగా పరిణమించాయి. ప్రజలపై సాగుతున్న దారుణాల నుండి రాజకీయ ప్రయోజనాలను పొందేందుకే నాయకులు ప్రయత్నిస్తున్నారు.” నేటి దేశ పరిస్థితికి సరిగ్గా సరిపోయే మాటలివి. అయితే ఈ మాటలు ఇప్పటివి కావు. నేటికి 96 సంవత్సరాల క్రితం నాటివి. 1927లో… పంజాబ్ నుండి వెలువడే ‘కీర్తి’ అనే పత్రికలో ప్రచురించబడిన ”మత ఘర్షణలు, వాటి నివారణ” వ్యాసంలోనివి. ఆవ్యాస రచయిత పేరు షహీద్ భగత్‌సింగ్! విప్లవ వీరుడిగా.. చిరుప్రాయంలోనే దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబమెక్కిన త్యాగధనుడుగా మనందరికీ తెలిసిన భగత్ సింగ్, మతోన్మాద రాజకీయాలను సమూలంగా వ్యతిరేకించాడన్న వాస్తవం ఈతరంలో చాలా మందికి తెలియదు. నేడు భగత్‌సింగ్ 116వ జయంతి. ఈ సందర్భంగా ఆ అమర వీరుడిని స్మరించుకుంటూ ఆయన మనకందించిపోయిన పోరాట వారసత్వాన్ని అంది పుచ్చుకోవాలి. ఆ వెలుగులో నేడు దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు వెతకాలి. అదే ఆయనకు మనమందించే నిజమైన నివాళి కాగలదు.
బ్రిటిష్ సామ్రాజ్యవాద దాస్య శృంఖలాల నుండి భారతదేశాన్ని విముక్తం చేయడానికి 23 ఏండ్ల చిరు ప్రాయంలోనే ప్రాణార్పణ గావించిన విప్లవ యోధుడు షహీద్ భగత్‌సింగ్. 1931, మార్చి 23న నాటి బ్రిటిష్ పాలకులు భగత్‌సింగ్, రాజ్‌గు రు, సుఖదేవ్‌లను లాహోర్ జైలులో ఉరితీశారు. పరాయి పాలకులను దేశం నుండి తరిమికొట్టాలనే ఆకాంక్షతోనే ఆగి పోకుండా.. స్వతంత్ర భారతదేశంలో ఎలాంటి విధానాలు అవలంబిస్తే ప్రజలకు మేలు కలుగుతుందనే విషయంలోనూ సమగ్ర దృక్పథం కలిగిన కొద్దిమంది స్వాతంత్య్ర ఉద్యమకారుల్లో భగత్‌సింగ్ ఒకడు. ఆయన 28 సెప్టెంబర్, 1907న నేటి పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ జిల్లా, బంగా గ్రామంలో జన్మించాడు. యుక్త వయస్సులోనే స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. ‘పంజాబ్ కేసరి’ లాలా లజపతిరారు నాయకత్వంలో నాడు ఉధతంగా కొనసాగుతున్న విప్లవకర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొ న్నాడు. నాటి యువతను ఉత్తేజపరిచిన నౌజవాన్ భారత్ సభ, హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించాడు.1928లో సైమన్ కమిషన్ రాకను నిరసిస్తూ లాలా లజపతిరారు నాయకత్వంలో పెద్దయెత్తున ధర్నాలు, హర్తాళ్లూ కొనసాగాయి. లాహోరులో జరిగిన నిరసన ప్రదర్శనపై విరుచుకుపడిన బ్రిటిష్ పోలీసులు లజపతిరారును లాఠీలతో తీవ్రంగా గాయపరిచారు. నవంబర్ 17న ఆయన ఆస్పత్రిలో కన్నుమూశాడు. తమ గురువు హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతినబూనిన భగత్‌సింగ్, రాజ్‌గురు, చంద్రశేఖర్ ఆజాద్‌లు నెలతిరక్కుండానే బ్రిటిష్ పోలీసు అధికారి జాన్ సాండర్స్‌ను లాహోర్ పోలీస్‌స్టేషన్ ఎదురుగానే కాల్చి చంపారు. దేశ ప్రజల్లో విప్లవభావాలు మరింతగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో.. 1929 ఏప్రిల్ 8న భగత్‌సింగ్, బటకేశ్వరదత్తులు ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు పేల్చారు. ప్రాణనష్టం జరగని రీతిలో బాంబులు వేసి, నినాదాలిస్తూ, కరపత్రాలు పంచుతూ అక్కడే నిల్చుండి అరెస్టయ్యారు. అసెంబ్లీపై బాంబు దాడి కేసుతో పాటు, సాండర్స్ హత్యకేసును తిరగదోడిన బ్రిటిష్ ప్రభుత్వం భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లకు ఉరిశిక్ష వేసింది.
గాంధేయ మార్గానికి భిన్నంగా విప్లవ కార్యాచరణ ద్వారా దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది వీరపుత్రులు ఉద్యమించారు. స్వాతంత్య్ర పోరాట చరిత్రలో వీరు నెరపిన పోరాటం కూడా సముజ్వల ఘట్టంగా నిలిచిపోయింది. ఈ తరహా విప్లవవీరుల్లో షహీద్ భగత్‌సింగ్‌ది విశిష్టస్థానం. దేశానికి రాజకీయ స్వాతంత్య్రం సాధించడంతోనే ఆగిపోకుండా, స్వతంత్ర భారతానికి ఆర్థిక స్వాతంత్య్రం కూడా సిద్ధించాలని, సామాన్యుడి సంక్షేమం సాకారం కావాలంటే దేశం సామ్యవాద పంథాను అనుసరించాలనే సమగ్ర రాజకీయ దృక్పథంతో ఉద్యమించిన వీరుడు భగత్‌సింగ్.
ప్రజాస్వామ్య, హేతువాద, సామ్యవాదం కోసం కార్యాచరణ
పద్దెనిమిదేళ్ల చిరుప్రాయానికే వివిధ రాజకీయ విధానాలకు సంబంధించిన అధ్యయనంలో భగత్ మునిగిపోయాడు. సింక్లేర్, విక్టర్ హ్యూగో, దాస్తోవస్కీ, బుఖారిన్, మార్క్స్, లెనిన్ రచనలను విస్తారంగా చదివాడు. ఈ విస్తత అధ్యయనం వెలుగులో.. ప్రజాస్వామ్యం, హేతువాదం, సామ్యవాద వ్యవస్థ సాధన కోసం తన రాజకీయ కార్యాచరణ కొనసాగాలని నిర్దేశిం చుకున్నాడు. ‘ఒక మనిషిని మరొక మనిషి, ఒక జాతిని వేరొక జాతి.. పీడించే సాంఘిక ధర్మాని’ కి ముగింపు పలకడమే తన రాజకీయ లక్ష్యంగా భగత్‌సింగ్ ప్రకటించాడు. తెల్లోడిని తరిమికొట్టి నల్లోడికి అధికారం కట్టబెట్టడమే స్వాతంత్య్ర పోరాట ఉద్దేశం కాదని భగత్‌సింగ్ తెగేసి చెప్పాడు. అన్ని రకాల పీడనలకు అంతం పలికినప్పుడే భరతమాతకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుందని గాఢంగా విశ్వసించాడు. నాడు భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాంప్రసాద్ బిస్మిల్ మొదలగు విప్లవకారుల వేదికగా హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ కొనసాగేది. భగత్‌సింగ్ చొరవతో సామ్యవాద స్థాపన సంస్థ లక్ష్యాల్లో చేరి, సంస్ధ పేరు హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్‌గా మారింది. ‘వందేమాతరం’ నాటివరకు విప్లవకారుల రణన్నినాదంగా ఉండేది. భగత్‌సింగ్ రాకతో ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ తోడైంది. భవిష్యత్తు భారతం ఎలా ఉండాలనే అంశంపై స్పష్టమైన దక్పథం గల విప్లవకారుడు భగత్‌సింగ్. పల్లెల్లోని రైతులను, ఫ్యాక్టరీల్లోని కార్మికులను చైతన్యపరచినప్పుడే దేశంలో సమ సమాజం సిద్ధిస్తుందని కలలుకన్నాడు. బ్రిటీష్ పెట్టుబడిదారుల నుండి రాజ్యాధికారం భారతీయ పెట్టుబడిదారులకు మారి నంత మాత్రాన ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆయన నమ్మాడు. దోపిడీ వ్యవస్థలన్నీ సమూలంగా అంతమయ్యే వరకు స్వాతంత్య్ర పోరాటం కొనసాగాల్సిందేనని ఆయన తన సహచరులకు చెబుతుండేవాడు.
మతరాజకీయాలు తప్పని..గురువునే ఎదిరించిన భగత్
భగత్‌సింగ్ ప్రాపంచిక దృక్పథంలో హేతువాదం కీలకాంశంగా నిలిచింది. మతం, మానవ పరిణామం, సమాజ పరిణామం మొదలగు అంశాలను భగత్ శాస్త్రీయంగా విశ్లేషించేవాడు. అన్ని రకాల మూఢాచారాలను తీవ్రంగా నిరసించే వాడు. సమాజంలోని ప్రతీ అంశాన్ని హేతుబద్ధ ఆలోచనా సరళితో విశ్లేషించి అవగతం చేసుకోవాలని యువతకు బోధించే వాడు. స్వాతంత్య్ర సముపార్జన కోసం మిలిటెంట్‌గా ఉద్యమిస్తున్న తరుణంలోనే ప్రజల పోరాట శక్తిని బలహీనపరిచే మత రాజకీయాల దుష్ట స్వభావాన్ని భగత్‌సింగ్ స్పష్టంగా గుర్తించగలిగాడు. మత రాజకీయాలను సమూలంగా వ్యతిరేకించాలని తమ సంస్థ సభ్యులకు నిర్దేశించేవాడు. భగత్‌సింగ్ స్థాపించిన యువజన సంఘం ‘నౌజవాన్ భారత్ సభ’లో మతోన్మాద భావజాలమున్నవారికి ప్రవేశం నిషిద్ధం. మతాన్ని రాజకీయాల నుండి దూరంగా ఉంచాలని, ప్రజల్లో మత సామరస్యం పెంపొందించేలా సభ్యులు కషి చేయాలని సంఘం నియమావళిలో పొందుపర్చారు. భగత్‌సింగ్, ఇతర విప్లవకారులకు రాజకీయ గురువు లాలా లజపతిరారు మృతికి ప్రతీకారం తీసుకోవడం కోసమే భగత్‌సింగ్ బందం చేసిన శాండర్స్ హత్య అంతిమంగా వారి ఉరిశిక్షకు కారణమైంది. అంతగా ఆరాధించిన లజపతిరారు.. ఒక దశలో మత రాజకీయాలకు పాల్పడినప్పుడు భగత్‌సింగ్ తన గురువునే ఎదిరించాడు. సహాయ నిరాకరణ ఉద్యమం ఉపసంహరణ తర్వాత లజపతిరారు క్రమంగా మత రాజకీయాలవైపు మరలాడు. 1924 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పుడు తమ గురువును, ఆయన మత రాజ కీయాలనూ ఓడించాలంటూ భగత్‌సింగ్, అతని సహచరులు ప్రచారం చేశారు. లాలా లజపత్ రారు అవకాశవాద వైఖరిని ఎండగడుతూ ”దారి తప్పిన నాయకుడు” పేరుతో ఒక కరపత్రం విడుదల చేసారు. పత్రికల వాళ్లు ప్రశ్నించినపుడు… ”కానీయనివ్వండి, వారెవ్వరో కాదు.. మేరే నాలాయక్ బేటేహీ హై!” అని సమాధానమిచ్చాడట లజపత్‌రారు. మత రాజకీ యాలను భగత్‌సింగ్ ఎంత తీవ్రంగా వ్యతిరేకించాడో… ఈ సంఘటన రుజువు చేస్తుంది.
శ్రామికవర్గ చైతన్యంతోనే ప్రజల ఐక్యత సాధ్యం
పైన ఉదహరించిన ‘కీరి’్త పత్రిక వ్యాసంలోనే.. ”ప్రజల మధ్య అనవసర గొడవలు నిరోధించడానికి.. ప్రజల్లో శ్రామిక వర్గ ఐక్యతను, అసలు సమస్యలపై ఉద్యమించే చైతన్యాన్ని పెంపొందించడం చాలా అవసరం” అని భగత్‌సింగ్ స్పష్టీకరించాడు. వలసవాద సంకెళ్లను ఛేదించడం కోసం మతం, కులం మొదలైన విభజనలకు అతీతంగా ప్రజల ఐక్యతను సాధించాలి. కలకత్తా నగరంలో మతఘర్షణలను అడ్డుకోవ డానికి.. హిందూ, ముస్లిం వర్గాల కార్మికులు చేతులు కలిపి, మతో న్మాదులను ఐక్యంగా ఎదుర్కొన్న వైనాన్ని ఉదహరించిన ఆయన.. సామాజిక విభజనలను అధిగమించిన శ్రామికవర్గ చైతన్యం తోనే ప్రజల ఐక్యత సాధ్యమని తేల్చిచెప్పాడు. గదర్ వీరులు మతాన్ని రాజకీయాల నుండి వేరు చేసి, మతాన్ని వ్యక్తిగత అంశంగా పరిగణించారని.. మతోన్మాద ప్రమాదాన్ని నిలువరించడానికి ఇదే సమర్థవంతమైన పరిష్కారం అని భగత్‌సింగ్ పేర్కొన్నారు. మతోన్మాద శక్తుల స్వార్ధ రాజకీయాలను విఫలం చేసి.. ప్రజల ఐక్యతను నిలబెట్టాలనే దృఢ దీక్షతో షహీద్ భగత్‌సింగ్ తన జీవితాంతం ఉద్యమించాడు. భారత జాతీయవాదానికి, వలసవాద వ్యతిరేక పోరాటానికి మతతత్వం కలిగించే ప్రమాదాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. ”వలసవాదం లాగే మతతత్వం సైతం ప్రజలకు పెద్ద శత్రువు” అంటూ తన సహచరులకు చెబుతుండేవాడు.
కానీ నేడు మతరాజకీయాలపై పాలన సాగిస్తున్న దేశాన్ని చూస్తే షహీద్ భగత్‌సింగ్ కలలుగన్న సమసమాజం ఈ దేశంలో ఇంకా అందనంత దూరంలోనే ఉండిపోయిందని అర్థమవు తోంది. ప్రజల ఐక్యతను చీల్చే మతోన్మాద రాజకీయాలు నేడు విశృంఖలంగా కొనసాగుతున్నాయి. కోట్లాది మంది సామాన్య ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిన పాలకులు కొద్దిమంది పెట్టుబడిదారుల సేవలో తరిస్తున్నారు. ఈ గడ్డు పరిస్థితుల నుండి దేశ రాజకీయాలను సక్రమ మార్గంలో పయనింప జేయడానికి, మతపరమైన మూఢనమ్మకాల మానసిక బానిసత్వం నుండి ప్రజలు విముక్తి పొందడమే నిజమైన స్వాతంత్య్రం. స్వాతంత్య్రవీరులు కలలుగన్న సమ సమాజం నిర్మించడానికి.. షహీద్ భగత్‌సింగ్ తాత్విక చింతనను, ఆయన పోరాట వారసత్వాన్ని కొనసాగించడమే సరైన పరిష్కారం.దానికి ఆ అమర వీరుడి ఆశయాలు నేడు మనకు సరైన తోవను చూపెట్టే దిక్సూచిగా ఉపకరిస్తాయి.
(నేడు షహీద్ భగత్‌సింగ్ జయంతి)
ఆర్. రాజేశమ్
9440443183