– నిరాశపర్చిన తెలుగు సినిమాలు
ఆస్కార్ – 2024 అవార్డుల కోసం మన దేశం నుంచి మలయాళ బ్లాక్‌బస్టర్ ‘2018’ చిత్రం అధికారికంగా ఎంపికైంది. వచ్చే ఏడాది ప్రదానం చేసే ఆస్కార్ అవార్డుల కోసం ఉత్తమ విదేశీ చిత్ర కేటగిరిలో ఈ చిత్రాన్ని సెలెక్ట్ చేశారు. టోవిటో థామస్ ప్రధాన పాత్రలో జూడ్ ఆంథోని తెరకెక్కించిన చిత్రమిది. 2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా తయారు చేసుకున్న కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆద్యంతం భావోద్వేగ భరితంగా నిర్మితమైన ఈ చిత్రం మలయాళంతోపాటు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదలై ప్రేక్షకులతో కన్నీళ్ళు పెట్టించింది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్ళని సాధించింది.
ప్రతి సంవత్సరం పలు దేశాలు ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో తమ దేశ చిత్రాలను పంపిస్తుంటాయి. ఈ క్రమంలో ఆస్కార్ 2024 కోసం మన దేశం నుంచి దాదాపు 22 చిత్రాలు పోటీ పడ్డాయి. ప్రముఖ ఫిల్మ్ మేకర్ గిరిష్ కాసరవల్లి అధ్యక్షతన 17 మంది సభ్యులతో కూడిన ఆస్కార్ కమిటీ చెన్నై వేదికగా ఈ చిత్రాలను వీక్షించారు. వీటిల్లో ‘2018’ చిత్రాన్ని కమిటీ ఎంపిక చేసింది. అమీర్‌ఖాన్ ‘లగాన్’ తర్వాత ఇప్పటివరకూ ఏ భారతీయ చిత్రమూ ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ఆస్కార్ బరిలో తుది వరకూ నిలవలేదు. అంతకముందు ‘మదర్ ఇండియా’, ‘సలామ్ బాంబే’ సినిమాలు మాత్రమే ఈ కేటగిరిలో పోటీ పడ్డాయి.
ప్చ్.. ఎంట్రీలోనే ఎగ్జిట్ ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు మన తెలుగు చిత్ర సీమకు కూడా దక్కటంతో రాబోయే ఏడాది కూడా ఏ తెలుగు సినిమా ఆస్కార్‌కి వెళ్తుందని అని సర్వత్రా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పైగా ఉత్తమ విదేశీ చిత్ర కేటగిరిలో ఈ ఏడాది ‘బలగం’, ‘దసరా’ చిత్రాలు సైతం పరిశీలనకు వెళ్ళాయి. దీంతో వీటిల్లో ఏ సినిమా అధికారికంగా మన దేశం నుంచి పోటీకి వెళ్తుందని ఆశగా ఎదురు చూసిన అందరికీ నిరాశే ఎదురైంది.