టెట్‌లో తగ్గిన ఉత్తీర్ణత

Reduced pass in Tet– పేపర్‌-1లో 36.89 శాతం,
– పేపర్‌-2లో 15.30 శాతం అర్హత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు బుధవారం ఉదయం పది గంటలకు విడుదలయ్యాయి. ఈ మేరకు ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌, టెట్‌ కన్వీనర్‌ ఎం రాధారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 15న టెట్‌ 1,139 కేంద్రాల్లో పేపర్‌-1, 913 పరీక్షా కేంద్రాల్లో పేపర్‌-2 రాతపరీక్షలను నిర్వహించామని తెలిపారు. తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠి, తమిళం, సంస్కృతం భాషల్లో పరీక్షలు జరిగాయని వివరించారు. టెట్‌ పేపర్‌-1కు 2,69,557 మంది దరఖాస్తు చేస్తే వారిలో 2,23,582 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. వారిలో 82,489 (36.89 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. పేపర్‌-2కు 2,08,498 మంది దరఖాస్తు చేయగా, వారిలో 1,90,047 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని తెలిపారు. వారిలో 29,073 (15.30 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత పొందారని వివరించారు. ఇందులో మ్యాథ్స్‌, సైన్స్‌ విభాగానికి 1,01,134 మంది హాజరుకాగా, 18,874 (18.66 శాతం) మంది పాసయ్యారని పేర్కొన్నారు. సోషల్‌ స్టడీస్‌ విభాగానికి 88,913 మంది 10,199 (11.47 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. అయితే టెట్‌లో ఫలితాలు భారీగా తగ్గడం గమనార్హం. పేపర్‌-1లో 36.89 శాతం, పేపర్‌-2లో కేవలం 15.30 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. డీఎస్సీ రాతపరీక్షలకు ముందు టెట్‌ నిర్వహించడంతో ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. అయితే తక్కువ మంది ఉత్తీర్ణులు కావడంతో మిగిలిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. టెట్‌ ఉత్తీర్ణత ఉంటేనే డీఎస్సీకి దరఖాస్తు చేసేందుకు అర్హులవుతారు. దీంతో టెట్‌ ఉత్తీర్ణత సాధించని అభ్యర్థులు డీఎస్సీకి దూరమయ్యారు.
అధికారుల అలసత్వం
విద్యాశాఖ, ఎస్‌సీఈఆర్టీ అధికారులు అలసత్వాన్ని ప్రదర్శించారు. టెట్‌ ఫలితాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వకుండానే చేతులు దులుపేసుకున్నారు. జిల్లాల వారీగా, జెండర్‌ వారీగా, కమ్యూనిటీ వారీగా ఫలితాలు ప్రకటించకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నదని పలువురు అభ్యర్థులు విమర్శిస్తున్నారు. కేవలం ఉత్తీర్ణత వివరాలు బహిరంగపరిచి ఇతర వివరాలు మీడియా ప్రతినిధులు అధికారులను అడిగినా సమాధానం చెప్పకపోవడం గమనార్హం.
టెట్‌ ఫలితాలు
పేపర్‌ హాజరు ఉత్తీర్ణత శాతం
1 2,23,582 82,489 36.89
2 (మ్యాథ్స్‌, సైన్స్‌) 1,01,134 18,874 18.66
సోషల్‌ స్టడీస్‌ 88,913 10,199 11.47
మొత్తం 1,90,047 29,073 15.30