ఎర్రజెండా నాయకత్వంలోనే పేదలకు న్యాయం

julakanati Rangareddy– మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
– సీపీఐ(ఎం)లో 200 కుటుంబాల చేరిక
నవతెలంగాణ-అడవిదేవులపల్లి
సమాజంలో పేద ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార వేదిక కమ్యూనిస్టు పార్టీ అని, ఎర్రజెండా నాయకత్వంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలోని మల్కచర్ల, చింతచెట్టుతండా, చిట్యాల, ముదిమాణిక్యం, గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా 200 కుటుంబాలు సీపీఐ(ఎం)లో చేరాయి. అనంతరం జూలకంటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని పోరాడి హక్కు పత్రాలు ఇప్పించిన పార్టీ సీపీఐ(ఎం) అని చెప్పారు. అడవిదేవులపల్లి మండలం కావాలని పట్టుబట్టి పోరాడి మండలాన్ని సాధించామన్నారు. ఈ రోజు ప్రభుత్వం సంక్షేమ పథకాలను బీఆర్‌ఎస్‌ పార్టీ పథకాలుగా మార్చేసిందని, పేదలకు పథకాలు అందడం లేదని చెప్పారు. గృహలక్ష్మి పథకాన్ని అర్హులకు అందించాలని, రాజకీయ జోక్యాన్ని నివారించాలని కోరారు. ఉద్యోగాల భర్తి విషయంలో కూడా తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను ఒప్పించి సత్తెరసాల వద్ద ఉన్న కృష్ణా నదిపై వంతెన సాధిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. అందరికీ సమాన న్యాయం జరగాలంటే ఎర్రజెండా రాజ్యం రావాలని, ఈ మండల ప్రజానీకం సీపీఐ(ఎం) నాయకత్వానికి అండగా ఉండాలని కొరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రవినాయక్‌, రాగిరెడ్డి మంగారెడ్డి, వినోద్‌నాయక్‌, మండల కార్యదర్శి జిట్టంగి సైదులు, నాయకులు, సైదనాయక్‌ కోటిరెడ్డి, పాపానాయక్‌, కరీమున్నీసా, దయానంద్‌ పాల్గొన్నారు.