ఊరికి ఆత్మ ఉంటే?

If the village has a soul?మనుషులకి ఆత్మలు ఉన్నట్టే ఒక ఊరికి ఆత్మ ఉంటే?, ఆ ఆత్మ తన కథ తానే చెబితే ఎలా ఉంటుంది అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. శివ కంఠమనేని హీరోగా నటించిన ఈ చిత్రానికి మల్లి దర్శకత్వం వహించారు. జి రాంబాబు యాదవ్‌ సమర్పణలో లైట్‌ హౌస్‌ సినీ మ్యాజిక్‌ పతాకంపై కేఎస్‌ శంకర్‌ రావు, ఆర్‌ వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మల్లి మాట్లాడుతూ, ‘ఒక డిఫరెంట్‌ స్క్రీన్‌ ప్లే బేస్డ్‌ సినిమా ఒక ఊరిలో ఎమైతే ఎగ్జైటింగ్‌ అంశాలు ఉంటాయో అవన్నీ ఈ మట్టి కథలో ఉన్నాయి. ఒంగోలు, చీరాల బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది. రాజమండ్రి, మచిలీపట్నం, హైదరాబాద్‌లోని పలు అందమైన ప్రదేశాల్లో షూటింగ్‌ జరిపాం. హీరోగా శివ కంఠమనేని అద్భుతంగా నటించారు. హీరోయిన్‌గా క్యాథలిన్‌ గౌడ ఒక డిఫరెంట్‌ పాత్రలో తప్పక మెప్పిస్తుంది. భరణి శంకర్‌, సత్య, నూకరాజు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు’ అని అన్నారు. ‘కాన్సెప్ట్‌ ఓరియంటేషన్‌తో ఒక మంచి యాక్షన్‌ డ్రామాగా ఖర్చుకి ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అక్టోబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నాం. త్వరలోనే ట్రైలర్‌తో మీ ముందుకు వస్తాం’ అని నిర్మాతలు చెప్పారు.