విద్య అనేది ఒక సామాజిక వస్తువు. ఇది సరుకు కాదు, దీన్ని మార్కెట్లో అమ్మడం లేదా కొనడం చేయకూడదు. ప్రయివేటీకరణ అనేది విద్యాహక్కును కుదిస్తుంది అంటారు నెల్సన్ మండేలా. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణచివేసే సమాజ నిర్మితిలో అణగారిన వ్యక్తుల సృజనాత్మకతను వెలికితీసి స్వేచ్ఛను ప్రసాదించేశక్తు లను పెంపొందింప చేసేదే విద్య అని ప్రముఖ విద్యావేత్త ఫాలో ప్రియరీ అభిప్రాయం. 1990లో నూతన ఆర్థిక సంస్కరణల ప్రారంభమైన తర్వాత ప్రభుత్వాలు అన్నిరంగాలతో పాటు విద్యను కూడా తమ పౌరులకు అందించవలసిన సామాజిక బాధ్యత నుండి తప్పుకొని మార్కెట్ శక్తుల చేతిలోకి పూర్తిగా అప్పగించే దిశగా ప్రయాణం ప్రారంభించి ఇప్పటికే మూడు దశాబ్దాలు దాటింది. భారతదేశంలో 1978లో ప్రయివేటు విద్యాసంస్థలలో 3.4శాతంగా ఉన్న విద్యార్థులు 1993 నాటికి 9.2శాతంగా 2021-22 ఖణ×ూజు ప్రకారం 2022 నాటికి ప్రయివేటు విద్యాసంస్థల్లో విద్యార్థులు 33శాతానికి పెరిగారు. ప్రయివేటు పాఠశాలల సంఖ్య 2.3శాతం నుండి నేడు 23శాతానికి చేరాయి. ఈ గణాంకాలు గత మూడు దశాబ్దాల కాలంలో దేశంలో పాఠశాల విద్యలో 90 తర్వాత పెరిగిన ప్రయివేటీకరణ వేగాన్ని తెలియజేస్తుంది. దాదాపు 8కోట్ల 83లక్షల మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్య నభ్యసిస్తూ ఉన్నారు. 3లక్షల 41వేలమంది ఉపాధ్యాయులు ఈ సంస్థల్లో పనిచేస్తున్నారు. వీరు మొత్తం ఉపాధ్యాయుల్లో 38శాతం ఉన్నారు. ఖచీజుూజఉ వారి +జువీ-2022 నివేదిక ప్రకారం 2014 నుండి స్థాపించిన 97వేల పాఠశాలలో 67వేల పాఠశాలలు, ప్రయివేటు పాఠశాలలు ఉన్నాయి. యునెస్కో గణాంకాలు ప్రకారం 187 దేశాల్లో పాఠశాల విద్యను ప్రయివేటుపరం చేసిన దేశాల్లో 15వ స్థానంలో ఉంది అంటే భారత్‌లో పాఠశాల విద్య ఎంత వేగంగా మార్కెట్ పరం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. చైనాలో ప్రాథమిక పాఠశాలలో 8.9శాతం సెకండరీ పాఠశాలలో 14.4శాతం విద్యార్థులు మాత్రమే ప్రయివేటు పాఠశాలల్లో ఉన్నారు. మన పొరుగునే ఉన్న శ్రీలంకలో సైతం ప్రాథమిక స్థాయిలో 3.2శాతం మంది విద్యార్థులు మాత్రమే ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్నారని యునెస్కో గణాంకాలు తెలియజేస్తున్నాయి.
కారణాలు: భారతీయ సమాజంలో పిల్లలను చదివించుకోవాలని ఆకాంక్ష పెరగడం ఒక సానుకూల అంశం. గతంలో లాగా పిల్లలకు నాలుగు అక్షరం ముక్కలు వస్తే చాలు అనుకునే దశ నుండి పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఈ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను స్థాపించి నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వం విఫలం కావడం విద్యార్థులు ప్రయివేటు బాట పట్టడానికి ఒక ప్రధాన కారణం. యునెస్కో +జువీ- 2022 ప్రకారం ప్రయివేట్‌కు వెళుతున్న విద్యార్థులలో 73శాతం తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందటం లేదు అని, ఇంగ్లీష్ మీడియం విద్య కోసం 12శాతం మంది, 10.2శాతం ప్రభుత్వ స్కూలు అందుబాటులో లేకపోవడం వలన, 4.7శాతం ఇతర కారణాలు ప్రయివేటు బాట పడుతున్నారని తెలియజేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఏడు పాఠశాలలకు ఒక పాఠశాలలో ఐదు తరగతులకు వరకు ఒకే ఒక ఉపాధ్యాయుడు బోధిస్తు న్నారు. కానీ ప్రయివేటు పాఠశాలల్లో 81.4శాతం పాఠశాలలు తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఉండకూడదు అని అనేక నివేదికలు, చీజుూ వంటివి సూచించిన ప్రభుత్వాలు ఉపాధ్యాయులపై బోధనేతర పనులతో బోధనా సమయం హరించకుపోతుంది. ఇది ప్రభుత్వ పాఠశాలలో విద్యా నాణ్యతను తీవ్రంగా దెబ్బతిస్తుంది. అందువలన ప్రభుత్వ పాఠశాలలు సామాన్య ప్రజలను నమ్మకాన్ని కోల్పోయాయి. ఐదు తరగతులకు ఒకే ఒక ఉపాధ్యాయినిచే బోధించడం అంటే విద్యా హక్కును నిరాకరించడమే అవుతుంది. కేంద్ర విద్యాశాఖ గణాంకాల ప్రకారం ఇప్పటికే దేశవ్యాప్తంగా 1:30 నిష్పత్తిలో పది లక్షల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి మొత్తం ఉపాధ్యాయులు 15.7శాతం అంటే ప్రభుత్వ విద్యపై ప్రభుత్వాల ప్రేమ అర్థమవుతుంది.
విద్య ప్రాథమిక లక్ష్యాలు పట్టవా?: విద్య ద్వారా సాంఘిక జాతీయ సమైక్యతను సాధించడం, ప్రజా స్వామిక విలువలు అభివృద్ధి పరచడం, సాంఘిక నైతిక, ఆధ్యాత్మిక విలువలను అభివృద్ధి పరచడం, అంతర్జాతీయ అవగాహన పెంపొందించడం వంటి లక్ష్యాలను కొఠారి కమిషన్ సూచించింది. జాతీయ విద్యావిధానం 1986 కూడా ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధన, క్రీడలకు వ్యాయామానికి సముచిత స్థానం, లౌకికత మానవత విలువలు పెంపొందించడం, విద్యలో సమాన కారకాలు కల్పించడం వంటి లక్ష్యాలను నిర్దేశించింది. నూతన విద్యావిధానం కూడా దాదాపుగా ఇదే లక్ష్యాలను సూచించింది. దాదాపుగా దేశంలో సగం మంది పిల్లలు చదువుతున్న ప్రయివేటు విద్యాసంస్థల నిర్వహణ, బోధనా విధానాలపై పర్యవేక్షణ లేకుండా భవిష్యత్తు భారతాన్ని నిర్మించలేం. ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలు ఆశించిన మేర లేవనేది అసర్ నివేదిక, యునెస్కో +జువీ రిపోర్టుల ద్వారా స్పష్టం అవుతుంది. రెండవ తరగతి స్థాయి పాఠ్య పుస్తకాన్ని చదవగలిగిన 3వ తరగతి విద్యార్థులు 20.5శాతం, ఐదో తరగతి విద్యార్థులు 42.8శాతం మంది ఎనిమిదో తరగతి విద్యార్థులు 69.2శాతం మంది మాత్రమే ఉన్నారు అంటే ఈ విద్యాసంస్థల్లో నాణ్యతను అర్థం చేసుకోవచ్చు. విద్యా ప్రయివేటీకరణ విద్యారంగంలో నూతన సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రయివేటీకరణ విధానాలు పాఠశాలలలో పెట్టుబడి పెట్టి నిర్వహించడం వరకే పరిమితం కావడంలేదు. విద్య ప్రాథమికలక్ష్యాన్ని మరిచిపోయేలా నూతన లక్ష్యాలను, నిర్వహణ విధానాలను ప్రవేశపెడుతున్నాయి. ఇవి మార్కెట్ విలువలను పెంచే విధంగా విద్యను మార్చి విద్యలో మాధుర్యాన్ని కోల్పోయాలా చేస్తున్నాయి. విద్యాసంస్థల మధ్య లాభాల పోటీలో భాగంగా పాఠశాలల పనివేళలను పెంచటం, పాఠశాల స్థాయిలోనే జేఈఈ, నీట్, ఐఏఎస్ వంటి పోటీ పరీక్షలకు సంసిద్ధులు చేయడం పేరుతో విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతున్నాయి. విద్యా స్వభావాన్ని మాత్రమే కాకుండా కీలకమైన సామాజిక సాంస్కృతిక సంబంధాలను కూడా రూపాంతరం చెందిస్తున్నాయి.
పరిష్కారాలు: 3.75 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 2025 నాటికి చేరి ప్రపంచంలో ఐదు ట్రిలియన్ల డాలర్లతో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా చెప్పుకుంటున్న దేశంలో భావిభారత పౌరుల విద్య కోసం మూడు శాతం లోపు మాత్రమే ఖర్చు పెడుతూ విద్యను అందించవలసిన బాధ్యత నుండి తప్పుకొని కార్పొరేట్ల చేతుల్లో పెట్టడం దేశభక్తి అవుతుందా? విద్యార్థులకు అసమాన అవకాశాలను కల్పించే ఈ విద్య వ్యవస్థను మార్చి కొఠారి కమిషన్ సూచించిన విధంగా కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయాలి. కత్తుల దూసే విద్య వ్యాపారంలో బలవుతున్న బాలల జీవితానికి రక్షణ కల్పించాలి. విద్యార్థులకు విరామ సమయం, ఆటలాడుకునే హక్కు, తగిన సౌకర్యాలు విద్యా సంస్థలు కల్పించాలి. విద్యావేత్తలు సూచించిన విధంగా ఏ తరగతి సిలబస్ను ఆ తరగతిలో మాత్రమే బోధించేలా చర్యలు తీసుకోవాలి. భావిభారత పౌరులకు నాణ్యమైన జీవనానికి గ్యారెంటీ ఇస్తూ పని హక్కును అంటే ఉద్యోగ గ్యారెంటీని కల్పించి ఆ పేరుతో జరుగుతున్న వ్యాపారాన్ని అరికట్టాలి. అప్పుడు మాత్రమే అత్యంత ఆనంద దాయకమైన దేశాల సరసన మన దేశం చేరుతుంది. ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఆనందదాయక దేశాల జాబితాలో మన దేశం అన్నింటికన్నా చివరిన 136 దేశాలలో 126వ స్థానంలో ఉంది అంటే ఈ దేశంలోనే ప్రజల ఎంత ఆనందంగా ఉన్నారు అర్థం చేసుకోవచ్చు. మన పొరుగునే ఉన్న శ్రీలంక, నేపాల్, చైనా బంగ్లాదేశ్ వంటి దేశాల కన్నా వెనుకనే ఉన్నాం. విద్య పేరుతో జరుగుతున్న తంతులో బలవుతున్న బాలల హక్కులను కాపాడకుండా ఈ దేశంలోనే ప్రజల ఆనందాన్ని రెట్టింపు చేయలేం. ఆనందదాయకమైన సమాజ నిర్మాణం కోసం విద్యావంతులు, బాలల హక్కుల సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు పాలకులపై ఒత్తిడి తీసుకురావడం ద్వారానే భవిష్యత్ ఆనందదాయక భారత్‌ను నిర్మించగలం.
జి. వెంకటేశ్వరరావు
9966135289
విద్య సరుకు కాదు… ఓ సామాజిక వస్తువు
11:01 pm