హరిత విప్లవ పితామహుడు

Father of Green Revolutionభారతదేశ హరిత విప్లవ పితామహడు ఎంఎస్‌ స్వామినాథన్‌ మరణంతో మన వ్యవసాయరంగం పెద్దదిక్కుని కోల్పోయింది. చనిపోయేనాటికి ఆయన వయసు తొంభై ఎనిమిది సంవత్సరాలు. స్వామినాథన్‌ భౌతికంగా లేకున్నా మన పంటల్లో, పైరుల్లో, చెలకల్లో అన్నదాతల చిరునవ్వుల్లో నిత్యసజీవుడే. వ్యవసాయ రంగంలో మన దేశం సాధించిన విప్లవం ఆయన నిర్విరామ కృషి ఫలితమే. ప్రపంచం యావత్తూ పచ్చని పాడిపంటలతో విలసిల్లాలని, కరువు లేని రోజులు ఉండాలని, రైతు రాజు కావాల నిత్యం తపించేవాడు. ఇసుక నేలల్లో కూడా పసిడి రాశులు పండించవచ్చని నిరూపించాడు. ఆకలిచావులులేని దేశాన్ని, పేదరికంలేని సమాజాన్ని కలగన్నారు. ఆ కల సాకారానికి జీవితకాలం కృషి చేశాడు. ఆయన పుట్టింది తమిళనాడులోని కుంభకోణమే అయినా ఆయన వ్యవసాయరంగంలో తెచ్చిన మార్పులు దేశాన్నే కాదు ప్రపంచంలోనే ఆయన్ను ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి.
తండ్రి సాంబశివన్‌ వైద్యుడు గనుక ముందు అదేబాటను ఎంచుకున్నారు స్వామినాథన్‌. అంతకన్నా ముందు ఆయన సామాజిక వేత్త. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా దళితులకు ఆలయ ప్రవేశానికి ఆయన తమిళనాడులో నాయకత్వం వహించాడు. చిన్నప్పటినుంచి తండ్రిలోని సేవాభావాలను చూసిన ఆయన మెట్రిక్యులేషన్‌ పూర్తికాగానే వైద్య కళాశాలలో అడ్మిషన్‌ పొందాడు. కానీ ఆ సమయంలోనే జరిగిన ఓ విషాద పరిణామం ఆయన్ను వ్యవ సాయ పరిశోధనలవైపు దృష్టి పెట్టేలా చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1943లో బెంగాల్‌ను కరువు రక్కసి వెంటాడింది. ఆహర కొరత సుమారు మూడు మిలియన్ల మందిని కబలించింది. ఈ మరణాలకు ఎలాగైనా స్వస్తి పలకాలని, కరువుకు శాశ్వత పరిష్కారం చూడాలని ఆలోచించాడు. దేశంలో తగినంత ఆహారం సమృద్ధికి తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రపంచ దేశాల్లో పర్యటించి మన దేశానికి అనువైన కొత్త వంగడాలను ప్రవేశపెట్టిన ఆధునిక శాస్త్రవేత్త అతడు. వరి, గోధుమ పంటలపై ఆయన చేసిన పరిశోధనలే నేడు మన కండ్లముందు కనిపించే పాడిపంటలు. ఆయన పరిశోధలన్నీ కూడా అధిక దిగుబడినిచ్చే పంటలే కావడం విశేషం.
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జన్యుశాస్త్రం, మొక్కల పెంపకం అంశాల్లో పరిశోధనలకుగాను న్యూఢిల్లీ లోని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరాడు. సైటోజెనెటిక్స్‌ (జీవకణ నిర్మాణం, విధులకు సంబంధించిన శాస్త్రం)లో డిస్టింక్షన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీని పొందాడు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ పరీక్ష రాసి ”ఇండియన్‌ పోలీసు సర్వీసు”కు ఎంపికయ్యాడు. నెదర్లాండ్స్‌లోని వాగెనేంజెన్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ జెనెటిక్స్‌ విభాగంలో బంగాళాదుంపల జన్యువులపై తన ఐ.ఎ.ఆర్‌.ఐ పరిశోధనను కొనసాగించడం కోసం యునెస్కో ఫెలోషిప్‌ను అంగీకరించాడు. సోలానమ్‌ విస్తృతమైన అడవి జాతుల నుండి సాగు బంగాళా దుంప (సోలనమ్‌ ట్యుబరేసం)కు జన్యువులను బదిలీ చేయడానికి కావలసిన విధానాలను ప్రామాణీకరించడంలో స్వామినాథన్‌ విజయం సాధించాడు. కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌కు వెళ్లి పీహెచ్‌డీని సంపా దించాడు.యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌లో పరిశోధకుడిగా వెళ్లాడు. కానీ సొంతగడ్డకే తన సేవలందించాలనుకుని దేశానికి తిరిగొచ్చాడు.
వ్యవసాయం, ఆహార లభ్యత, జీవవైవిధ్య పరిరక్షణ వంటి పర్యావరణ అనుకూల పద్ధతులతో స్వామినాథన్‌ అనేక అవార్డులు, బహుమతులతో సత్కరించబడ్డారు. తన పరిశోధన పనుల ప్రయోజనాలను భౌగోళిక సరిహద్దుల్లో విస్తరించి నందుకు అనేక అంతర్జాతీయ సంస్థలచే ప్రశంసించబడ్డాడు. అధిక దిగుబడినిచ్చే గోధుమల అభివృద్ధికి చేసిన కృషితో ఆయన చరిత్రకెక్కాడు. వ్యవసాయ రంగానికి చేసిన సుధీర్ఘమైన సేవలకు గాను ఆనేక అవార్డులు, బహుమతులు వరించాయి. 84 గౌరవ డాక్టరేట్ల గ్రహీతగా, అనేక పీహెచ్‌డీల మార్గదర్శకుడిగా పేరు పొందాడు. అత్యున్నతమైన రామన్‌ మెగసెసే అవార్డు, పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. దేశ వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు, అభివృద్ధికి ఆయన చేసిన కృషితో ‘హరిత విప్లవ పితామహుడి’గా ప్రపంచ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న మహోన్నతమైన వ్యక్తి, మానవతావాది ఎంఎస్‌ స్వామినాథన్‌. ఆయనకు ఈనేల నిత్యం నివాళులర్పిస్తూనే ఉంటుంది.