బతుకు గీత

Life line”అరే చిన్నా.. మన కారు జోరుగ పోతుందిగని జెర మెల్లగ పోనియ్యిరా..” హెచ్చరించాడు పక్క సీట్లో కూర్చున్న ఈవెంట్‌ మేనేజర్‌ వాసు నాయక్‌.
”అన్నా.. మీరెవ్వరు భయపడకుండ్రి. డొక్కు బండి కాదిది, ఇన్నోవా.., నూటిర్వై పోతుంది. ఇగో వందకు దింపిన.” బదులిచ్చాడు డ్రైవర్‌.
”వరంగల్‌ ఇంకెంత దూరమున్నది..?” మధ్య సీట్లో కూర్చున్న గాయకురాలు గీత అడిగింది.
”ఇంకో అరగంటలో మన ప్రోగ్రామ్‌ కాడికి పోతమక్కా.”
”గీతా..! ఈరోజు ప్రోగ్రామంతా నీ చేతుల్లోనే ఉన్నది. మెయిన్‌ సింగర్వి నువ్వే. మనమింతకు ముందిచ్చిన స్టేజ్‌ షోస్‌ వేరు, ఈరోజు వేరు. ఇక్కడ మన టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకుంటే బోలెడన్ని అవకాశాలొస్తరు. నెక్స్ట్‌ వీక్‌ జూబ్లీహిల్స్‌, ఆ తర్వాత ముంబై, ఢిల్లీ ప్రోగ్రామ్స్‌ దక్కే ఛాన్స్‌ ఉంది” వాసు చెప్పగానే,
”నా కీబోర్డు మీద ఒట్టేసి చెప్తున్నా. ఈ ప్రోగ్రాం తర్వాత మన టీం కోసం జనాలు క్యూ కడతరు సూడుండ్రి” అని కీబోర్డ్‌ ప్లేయర్‌ శివ నమ్మకం పెంచాడు. ఇతర గాయకులు వినీష్‌, సుమీల, డోలక్‌ శేఖర్‌ తలో మాటతో గీత టాలెంట్‌ గురించి తెగ పొగిడేస్తున్నారు.
”మీరందరూ నామీద ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు మీ మాట నిలబెడతా. కానీ నన్నింత బతిలాడొద్దు. మీ సపోర్టుకు నేనే థాంక్స్‌ చెప్తున్నా”
”హమ్మయ్య థాంక్యూ వెరీ మచ్‌ గీత గారూ..” అని వాసుతో గొంతు కలిపారందరూ. వెంటనే గీత ఫోన్‌ రింగయ్యింది. అమ్మ యాదమ్మ కాల్‌ ఎత్తి ”అమ్మా చెప్పు..?” అడిగింది.
”గీతా.. ఆ మాసిన మొకపోనికేం పుట్టిందో ఏమో బిడ్డా. బాగా తాగొచ్చి శెల్లెల్ని మల్లా పొల్లు పొల్లు కొట్టిండంట. డేక్కుంట డేక్కుంట పిల్లల్ని బట్కోనొచ్చింది. బక్కపానమాయె, ఒల్లంతా పుండు పుండయింది. జెర జెల్ది రాయే.. నాకిక్కడ తోస్తలేదు. దేవులాట పాడువడ, నాకొక్క నాడు నిమ్మలం లేకపాయే.”
”అమ్మా.. నువ్వేం భయపడకు. నేను చాలా దూరంలున్న. రమేశ్కి ఫోన్‌ చేసి చెప్తగా. ఆటో మాట్లాడుకొస్తడు. ఎమ్మటే పక్క గల్లీల దావకానకి తీస్కపోండ్రి” అని చెప్పి ఫోన్‌ కట్‌ చేసి తన లేడీస్‌ టైలర్‌ షాప్‌ నడిపిస్తున్న సిన్సియర్‌ వర్కర్‌, నమ్మిన బంటు రమేశ్‌ కి కాల్‌ కలిపింది.
”రమేశ్‌..! అర్జెంటుగ షాప్‌ బంజేసి ఆటో మాట్లాడి కమలను, అమ్మను హాస్పిటల్‌ కి తీసుకుపోవా.. ప్లీజ్‌..”
”అక్కా.. కమలక్కను బావ మల్లా గొట్టిండా ఏందీ..?”
”మూడేళ్ళ సంది చూస్తనే ఉన్నావుగా.. జెల్డి తీసుకెల్లు తమ్మీ.?”
”నువ్వు దూరమున్నవుగా.. నువ్వైతే రా అక్కా, అందాక నేను చూసుకుంటా.”
అయినా సంతృప్తి పడని గీత ”కారాపండీ.. నేనింటికి పోవాలె..” అని ఆగని ఆందోళనతో అరిచింది.
”గీతా..! టెన్షన్‌ పడకు. నువ్వింటికే ఎల్దువుగాని. కమలను హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పినవు కదా..?” అని వాసు అడిగాడు.
”చెప్పిన గని నాకెందుకో లోపల భయం భయంగా ఉంది. కమల ఏమైతదో ఏమో..!”
”నువ్వు పోతే మన ప్రోగ్రామ్‌ అట్టర్‌ ప్లాప్‌ అయితదక్కా..” కారులో కూర్చున్న కళాకారులందరూ బాధను వ్యక్తం చేశారు.
”మనమెట్లాగూ ప్రోగ్రామ్‌ దగ్గరకు వచ్చాం. అనుకున్న టైంకే పెళ్ళయిందట. వచ్చిన వాళ్ళంతా కొత్త దంపతులను కలుస్తున్నారట.
ఇప్పటికిప్పుడు ప్రోగ్రామ్‌ క్యాన్సిలంటే నీకూ, మన టీం కి పెద్ద దెబ్బ గీతా” అని వాసు బతిమిలాడాడు.
”మీరెన్నయినా చెప్పండి. ఆ స్టేజీ ఎక్క లేనూ, నేనిప్పుడు పాడలేను. లోపల ఏడుస్తూ పైకి నవ్వు నటించమంటే నా వల్ల కాదు. ప్లీజ్‌ వాసు..! నన్ను బస్టాండ్ల వదిలేయండి”
”ఇప్పుడు బస్సెక్కినా, రైలెక్కినా ఎంతో కొంత టైం వేస్టయితది గీతా. అక్కడ వేస్ట్‌ చేసుకోవడం కంటే ఇదీ ముఖ్యమనుకో. ఒక అడ్వకేట్‌ కోర్టులో సీరియస్‌ గా వాదిస్తుండగా అతని భార్య చనిపోయిందన్న సమాచారం చిట్టీ ద్వారా వస్తుంది. కానీ ఆ చిట్టీ జేబులో పెట్టుకొని మరీ వాదించి ఆ కేసు గెలిచాడట. నువ్వు చిన్న సమస్యకే భయ పడితే ఎట్లా..? మనం మన టీం కి మెరుగైన అవకాశాలు రావాలనుకున్నాం. కానీ రోజులన్నీ మనవి కావు. పబ్లిక్‌ పెర్ఫార్మన్స్‌ అనేది యుద్ధ రంగమని నీకూ తెలుసు. ఆ యుద్ధరంగంలో గెలుపోటములు సహజం. నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్ళయిన తాగి బతకమన్నాడో సినీ కవి. వ్యతిరేక పరిస్థితులను అనుకూలింప చేసుకున్న వాళ్లే జీవితంలో పైకొస్తారు గీతా… కాలం మారుతుంది. ఈ రోజుల్లో కరవోకే (సaతీaశీసవ) యాప్‌ వచ్చి ఆర్కెస్ట్రా కళాకారులను మాయం చేసేసింది. అయినా మనల్ని పిలుస్తున్నారంటే ఆర్కెస్ట్రా మీది ప్రేమ కన్నా మోస్ట్‌ టాలెంటెడ్‌ గ్రూప్‌ గా మనకు పేరుంది కాబట్టే. డోంట్‌ వర్రీ గీతా.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకు”
వాసు గీతకు చెప్పిన గీతోపదేశం ఆ కారులో ఉన్న వారందరినీ కదిలించింది. ముందు గంట అనుకున్న ప్రోగ్రాం రెండు గంటలకు పైగా సమయం తీసుకుంది. కళాకారులందరిలో ఆనందాన్ని నటించి చూపిన గీతకే ఎక్కువ ప్రశంసలు వచ్చినవి. పెళ్ళిళ్ళ సీజన్‌ కావడంతో వరుసగా అవకాశాల సంఖ్య పెరిగింది. భోజనాలు చేసిన తర్వాత హైదరాబాద్‌ వైపు తిరుగు పయనమైనారు. కారులోని కళాకారులందరూ గీతను అభినందనల్లో ముంచెత్తుతుండగా గీత మాత్రం చెల్లెలి పరిస్థితి ఏమవుతదోనని లోలోపల మదన పడుతున్నది.
”కమల డిగ్రీ వరకు చదివిందన్నావ్‌..! ఎందుకింత టార్చర్‌ ఫేస్‌ చేస్తుంది. మరీ ఇంత సెన్సిటివయితే ఎట్ల గీతా…?”
”లేదు వాసూ, అది నా కన్నా మూడేళ్ల్లు చిన్నదైనా ఎంతో మొండి ధైర్యంగా ఉండేది. నాకు, అమ్మకు తనే డేరింగ్‌ మోడల్‌. తన డిగ్రీ క్లాస్మేట్‌ గిరిని ప్రేమించానని చెప్తే ఆ అబ్బాయి కులం వేరయినా చాలా హెల్పింగ్‌ నేచరని, నో అనకుండా పెళ్ళి చేసాం. మూడేళ్ళు హాయిగా ఉన్నారు.
ఇద్దరాడపిల్లలు పుట్టిన తర్వాతనే దానికి చీకటి రోజులు మొదలైనవి. వారసుడు లేడని ఆడబిడ్డలు, తోడి కోడళ్ళు, అత్తమామల వేధింపులెక్కువైనవి. కమలకు ఇద్దరాడపిల్లలే పుట్టారనో, మేం కులం తక్కువనో కానీ కొత్త రకం వివక్షే దాని పాలిట శాపమై కూర్చుంది. వాడు తల్లి తండ్రుల మాటలకు తలొగ్గి, అక్రమంగా రెండో పెళ్ళి చేసుకున్నాడు. తన రాజకీయ పలుకుబడితో, కుల దురహంకారంతో ఆరేళ్లుగా ఇష్టం వచ్చినట్టు దెబ్బలు కొడుతున్నా కమల మాకెవరికీ చెప్పుకోకుండా తన బాధలన్నీ దిగమింగి తన పిల్లల కోసం ఓపికతో అవమానాలనూ అలవాటుగా మార్చుకుంది”
”వాడి మీద కేసు పెట్టక పోయారా..? గాలికొదిలేస్తే ఎట్లా?”
”మగ దిక్కు లేనిల్లు, ఏం కేసు పెడతాం. ఆ కేసుల గొడవ మాకెందుకని వాడు రెండో పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా కమలనే సర్దుకు పొమ్మని చెప్పినం”
”మీకు బంధువులెవరూ లేరా..?”
”ఎక్కడి బంధువులు, ఎవరు ఆప్తులు. ఎవరి స్వార్థాలు వారివి. నేను టెన్త్‌లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోతే కనీసం ఓదార్చిన మానవత్వపు మనుషులు కనపడితే ఒట్టు. ఏడాది పొడవునా అమ్మతోనే దు:ఖాన్ని పంచుకున్నం. కూలి పనుల్లో అమ్మతో కష్టాలూ పంచుకున్నం. రామన్నపేట దగ్గరి మా చిన్న ఊరిలో సరైన పని దొరక్క ధైర్యం చేసి అమ్మ మమ్మల్ని తీసుకొని ఎల్బీ నగర్కి వచ్చింది”
”అమ్మో ఈ సిటీల బతకాలంటే చాలా కష్టం గీతా! మీ అమ్మ ధైర్యానికి నా సెల్యూట్‌”
”అమ్మ కూలీ పనులు చేసినా, మేం ఇండ్లల్ల పనులు చేసి అమ్మకు ఆర్థిక భరోసా ఇచ్చినా మా చదువులు ఆపలేదు. నా ఇంటర్‌ అయ్యాక టైలర్‌ పని నేర్చుకున్న. డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ లో బీ.కామ్‌ పూర్తి చేసిన. తర్వాత చిన్న టైలర్‌ షాప్‌ పెట్టి, డెవలప్‌ చేసి ఇప్పుడు వర్కర్స్‌ సాయంతో నడిపిస్తూ చిన్న ఇల్లు కూడా కొనుక్కున్న. మనందరం కలిసి ఎన్నో ప్రోగ్రాంలిచ్చినా నా సోదెప్పుడు చెప్పలేదు. మీరు ఓపికతో విన్నందుకు అందరికీ సారీ (గుడ్ల నిండా నీళ్ళతో)”
”మరి పెళ్ళెందుకు చేసుకోలేదు…?”
”పెళ్ళా….! (వెటకారపు నవ్వుతో) చదువులో ఎప్పుడూ ముందుండి జీవిత కాలంలో వెనుకబడి పోతున్న కమలను ఎట్టా గట్టెంకించాలో నాకర్థమైతలేదు. జీవితాలను ఏడిపించే పెళ్ళి నాకక్కర లేదనుకున్న”
”నువ్వెప్పుడూ జోవియల్గా ఉంటూ నవ్వుతూ నవ్విస్తుంటే నీకే బాధల బాదరాబందీ లేదనుకున్న. కానీ ఈ రోజు నువ్వేంటో అర్థమైంది. మీ పర్సనల్‌ లైఫ్‌ అడిగినందుకు మన కళాకారులందరి తరుపున నేనే సారీ చెప్తున్న గీతా..! భువనగిరొచ్చింది. అందరం కాస్త కాఫీ తాగి రిలీఫ్‌ అవుదాం”
”లేదు వాసు.. నీకు తెలవందేముంది. అర్జెంటుగ వెళ్లాలి. చెల్లికి ఎట్లుందో ఏమో…! దయచేసి అందరూ కోఆపరేట్‌ చేయండి” అనగానే అందరూ ”ఓ.కే…!” అనడంతో మిగిలిన దూరాన్ని వాయువేగంతో దాటేసిన కారు కమల ఉన్న హాస్పిటల్‌ ముందు ఆగింది.
”మే ఐ హెల్ప్‌ యూ.. గీతా..?”
”పర్వాలేదు వాసు..! చెల్లిని నేను చూసుకుంటా మీరెళ్ళండి” అంటూ హాస్పిటల్‌ లోపలికి వెళ్ళింది. రమేశ్‌ అక్కడే ఉన్నాడు. అమ్మను కలిసింది. అమ్మ గీతను పట్టుకొని కమల భర్తను తిట్టుకుంటూ బాధనంతా వెళ్ళ గక్కింది. అమ్మను ఓదార్చింది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. డాక్టర్‌ దగ్గరికి వెళ్ళి వివరాలడిగింది. కమల తలకు బలంగా గాయమైందని చెప్పాడు. ఎదురు రొమ్ముకు, వీపుపై తగిలిన దెబ్బలతో గుండె, ఊపిరితిత్తులకు సమస్య వచ్చిందన్నాడు. నిర్లక్ష్యం చేయొద్దని, జాగ్రత్తగా ఉండమన్నాడు. డాక్టర్‌ జవాబుకు చలించిపోయింది గీత. ”కమల బతకాలి… కమల బతకాలి” అనుకుంటూ ఆరు నూరైనా సరే కమలను దక్కించుకోవాలనుకుంది. కమలకు పుట్టిన ఇద్దరాడపిల్లల సంరక్షణకు తండ్రి నుండి ఏ సహకారం, నమ్మకం, ధైర్యం ఉంటుందన్న ఆశ లేదు. కనీసం కమలను బతికించుకుంటే తన కాళ్ళ మీద తాను నిలబడగలదు. పిల్లలని సంతోషంగా పెంచగలదు. అన్నీ ఆలోచించిన గీత తనచేతిలో మూడు లక్షల వరకు నగదున్నా ఇంటిని కూడా తాకట్టు పెట్టడానికి సిద్ధమైంది కమల కోసం.
డాక్టర్‌ సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కమలను పేరున్న పెద్ద హాస్పిటల్‌ కి మార్చింది. విషయం తెలిసినప్పటినుండి కమల భర్తకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయక పోగా మెసేజ్‌ పెట్టినా రిప్లై రాలేదు. ఎవ్వరేం చేయలేరన్న ధీమా, అహంకారదర్పం అన్నీ చూపించే వాడితో ఏ లాభం లేదని వదిలేసి కమలకిచ్చే వైద్యం పైనే దృష్టి సారించింది గీత. ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి ఐదు లక్షలు తెచ్చి హాస్పిటల్‌ ఖర్చులకి అందించింది. పది రోజులైనా కమల పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. మరింత క్షీణిస్తుంది. ముందే ఇచ్చిన ఐదు లక్షల ఖర్చు పరిమితి దాటిందని మరో ఐదు లక్షలిస్తేనే తర్వాతి ట్రీట్మెంట్‌ స్టార్ట్‌ అయితదని హాస్పిటల్‌ సిబ్బంది చెప్పారు. ఏదో అనుమానంగా ఉందని కమల దగ్గరికెళ్ళింది గీత. మాట సరిగ్గా రావడం లేదు. పక్కనే ఉన్న నర్సుని అడిగింది.
ఇద్దరు డాక్టర్లు, నలుగురు నర్సులు పక్కకు కదలకుండా ఎంత ప్రయత్నించినా కమల పరిస్థితిలో మార్పు రాలేదు. వైద్యానికి సహకరించ లేని తీవ్ర గాయాలతో ఉన్నప్పటికీ కమల ”నేను బాగైతానా, బయటికెళ్తానా, నా పిల్లలెట్లా…!” అని మాటి మాటికి అడుగుతుండేదని కొద్ది సేపటి కిందనే శ్వాస విడిచిందని చెప్పారు. గుండెలోకి జొరబడ్డ భయంతో గీత వాసుకు ఫోన్‌ చేసి జరిగిన విషయమంతా చెప్పి అర్జెంట్గా రమ్మని చెప్పింది. వాసు వెంటనే స్పందించి తన క్లాస్‌మేట్‌ జర్నలిస్ట్‌ శంకర్‌ తో కలిసి వచ్చాడు. చిన్ననాటి నుండి కష్టసుఖాలన్నీ కలిసి పంచుకున్న కమల కంటికి, ఇంటికి దూరమైందని తన కుడి భుజం పోయిందన్న బాధతో గీత కుమిలి కుమిలి ఏడుస్తుండగా, ”ఇద్దరాడపిల్లల్ని మొగోళ్ళ లెక్క పెంచి పెద్దచేస్తే ఆగమయిపాయెర బిడ్డో…!” అని అమ్మ పిల్లలని పట్టుకొని దిక్కులు పిక్కటిల్లేలా శోకాలు పెట్టి రోధిస్తుంది. హాస్పిటల్‌ సిబ్బంది మొత్తం పన్నెండు లక్షల ఖర్చు చూపించారు. వాసు, శంకర్ని వారితో మాట్లాడించాడు. ”డబ్బులు బాగానే లాగేశారు కానీ ట్రీట్మెంట్‌ కు గ్యారెంటీ ఇవ్వలేదుగా?” అని గట్టిగా మందలించి ఏడు లక్షల వరకు తీసుకునేటట్టు ఒప్పించాడు.
ఉత్తరోత్తర క్రియలన్నీ అయిన తర్వాత కొందరు దగ్గరి బంధువులు కమల అత్తగారింటికి వెళ్లి పంచాయతీ పెట్టించి కూర్చోని మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఏడెనిమిది విడతలకు పైగా ఎంత ప్రయత్నించినా రెండో భార్యతో కలిసి దూర దేశం వెళ్లాడని, ఆచూకీ దొరకడం లేదని తల్లిదండ్రులు చెప్పడంతో ఆ ప్రయత్నాన్ని పూర్తిగా మానుకుంది గీత. ఆ చిన్నపిల్లలకు శాశ్వత పోషణ బాధ్యతను భుజానేసుకుంది. వజ్రసంకల్పం కలిగిన కమల జీవితం నల్లబొగ్గులా మారి పోయిందేంటని పదేపదే ఆలోచిస్తూ అసలు పెళ్లి అనే మాట అంటేనే విరక్తి పెంచుకుంది. పిల్లల కోసం తాను పెళ్లి చేసుకోవద్దని, హద్దుల గీతలెపుడూ దాట కూడదని, తన జీవితం పిల్లలకే అంకితం చేయాలని స్పష్టంగా నిర్ణయించుకుంది.
తమ్ముడి లాంటి రమేశ్‌ తో టైలర్‌ షాప్‌ నడుపుతూ ఏ వరుసా కలుపుకోని వాసుతో ప్రొఫెషనల్‌ సింగర్‌గా ప్రదర్శనలిస్తూనే ఉన్నది. పని ఉన్నా లేకపోయినా గీత ఇంటి దగ్గర వాసు ఎక్కువగా కనబడుతుండేవాడు. దాంతో చుట్టుప్రక్కల వారంతా వింతగా చూస్తుంటే అమ్మ కడుపులో కొత్త భయం మొదలైంది. అయితే గీత తన ఒంటరి జీవితమే హాయిగా ఉన్నదన్న భావనలోనే ఉన్నది. కానీ అమ్మ ఆందోళనతో ఎంతో మందితో పరోక్షంగా పెళ్లి గురించి గీతకు చెప్పించే ప్రయత్నం చేసినా గీత మాత్రం మొండిపట్టు వీడ లేదు. వితండ వాదం చేస్తూ అందరి నోళ్ళు మూయిస్తుంది. అయినా ఓ రోజు ధైర్యంతో అమ్మ ”ఎట్లనే గీతా..! పెళ్ళి చేసుకోరాదు?” అని అడిగింది.
”అమ్మా నాకిప్పుడు ముప్పై ఐదేండ్లు, నన్నెవరు చేసుకుంటరు చెప్పు. చేసుకున్నా ఏం లాభం..? ఎవరికి లాభం..?”
”సూడు బిడ్డా.. నిన్న పొద్దుమీకి ఆ వాసొచ్చి నాకన్నీ చెప్పిండు. నిన్నే పెళ్ళి చేసుకుంటడంట. మూడేళ్ల సంది నీకు శెప్తననునుకొని శెప్పలేదంట.”
”అమ్మా.. నీకెన్ని సార్లు చెప్పాల్నే..? ఆ మాట మాట్లాడొద్దనీ” ఇంకేదో గొడవ చేయబోతుంటే…
”ఆ వాసు మన కులపోడు కాకున్నా నమ్మకస్తుడు బిడ్డా.. మూడేండ్ల సంది సూస్తున్న మీరిద్దరూ మంచిగ బతుకుతర్రా. అదురుష్టం తలుపునొక్కపారే తాక్తదంట. నీకొచ్చిన అదరుష్టాన్ని దూరం చేసుకోకు బిడ్డా” అని అమ్మ బతిమిలాడుతుంటే గేటు తీసుకుంటూ ఇంట్లోకి వస్తూనే వాసు ”హారు గీతా.. అమ్మతో గొడవ చేస్తున్నావా..?”
”అవును ఈ వయసులో పెళ్లి చేసుకోమంటుంది అమ్మ ఎవరిని వుద్దరించడానికో…! నాకు నన్నుగా బతకనివ్వరా..? నన్ను ఆలోచించుకోనివ్వరా మీరు..?” అంతా మీ ఇష్టమేనా..?” ఎరుపెక్కిన కళ్ళతో జవాబిచ్చింది గీత.
”గీతా.. మెయిన్‌ సింగర్స్‌గా మనమెన్నో వేదికలెక్కాం. ఒకరికొకరం కష్టసుఖాలు చెప్పుకుంటం. మనకు జనంలో మంచి క్రేజీ ఉంది. కెపాసిటీని బట్టి స్థిరాస్తులూ కొన్నాం. ఎట్లా చూసినా బాగానే డెవలపయినం గీతా. మనిద్దరం కలిసి బతికితే తప్పేం కాదనుకున్నా. అందుకే నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకున్నా. ఎప్పటి నుంచో ఈ మాట నీకు చెప్పాలనుకున్నా, కుదరలేదు. పెళ్ళంటే, జీవితమంటే పూర్తిగా వ్యతిరేకించే నీకు ఎట్లా చెప్పాలో అర్థం కాక నిన్న మీ అమ్మకు చెప్పేశాను. వాసు నాయక్‌ అనే నా పేరు నుండి ఈరోజు పోలీస్‌ కం ఆర్టిస్ట్‌ కం ఈవెంట్‌ మేనేజర్‌ వరకు మీకు తెలిసిందంతా వివరించాను. ఓ వైపు కమల పిల్లలున్నారు. కమల సమస్య అట్లాగే ఉన్నది. నువ్వు ఓ.కే. అంటే కమల భర్తతో కోర్టుల పరంగా ఫైట్‌ చేయడానికి నేను రెడీ. కమలకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి వాడు భూమ్మీద ఎక్కడ దాక్కున్నా తీసుకొచ్చి ఈ చిన్న పిల్లలకు న్యాయం చేయిస్తా. నిన్ను కూడా ఈ లోకం వేదికపై విజేతగా నిలిపే బాధ్యత నాది”
”వాసు నాకీ తల నొప్పెందుకూ..? నువ్వెన్నన్నా చెప్పు. కమలను తలచుకుంటే నాకేదీ నమ్మ బుద్దైత లేదు. దయచేసి ఇక్కడి నుండి వెంటనే మీరు వెళ్ళిపోండి. ప్లీజ్‌ వాసు ప్లీజ్‌..!”
”ఓ.కే. గీతా. ఏది ఏమైనా నా విషయంలో నీకు నచ్చిన నిర్ణయమే తీసుకో. వారం కావాలా, నెల రోజులు కావాలా, సంవత్సరం కావాలా, జీవిత కాలం కావాలా? ఎప్పటికైనా నీ కోసమే ఎదురు చూస్తుంటా. బై గీతా. వస్తానాంటీ.” అంటూ ఊపిరి లేని దూది విగ్రహంలా కదిలి వెళ్ళి పోయాడు.
”నదిలా పారుతున్న కన్నీళ్లతో అమ్మ ”ఎవరు చెప్పినా యినవే నువ్వు…? ముదనష్టపుదానా…!, ఉన్నొక్క నా పానం పోయినంక మొండి దానివై సల్లగుండు బిడ్డా.. సల్లగుండు. శెప్పంగ ఇననోల్ల శెడంగ సూస్తరంట” అంటూ ఏడుపు రాగం అందుకుంది. ఏమీ చేయలేని అసహాయురాలిగా.
”కట్టలు తెంచుకుని పొగలు సెగలు కక్కుతున్న విచిత్ర సందర్భంలో ”అమ్మమ్మా..! పెద మమ్మీ…!” అంటూ అప్పుడే కాన్వెంటు నుండి వచ్చిన చిన్న పిల్లలిద్దరి కళ్ళల్లో తన భవిష్యత్తును చూస్తూ మంచు పర్వతంలా కరిగి పోయింది గీత. ఎన్నడూ గీత దాటని గీత తన బతుకు గీత మీద వెచ్చని ఆశతో అమ్మ కోసం, పిల్లల కోసం, కమల కోసం, మగ దిక్కు కోసం సెల్లులో వాసు నంబర్‌ వెతుకుతోంది. పాత కొత్తల మేలు కలయిక కోసం.
డా||మండల స్వామి, 9177607603