6న సమ్మెలకు సంఘీభావం

–  సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధికంగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికుల పోరాటానిక ఈ నెల 6వ తేదీన సంఘీభావాలు తెలపాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కా రాములు, పాలడుగు భాస్కర్‌ రాష్ట్రంలోని కార్మిక వర్గానికి, సంఘాలకు విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాల్లో తీర్మానం చేసినట్టు శనివారంనాడోక ప్రకటనలో పేర్కొన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలనీ, అందరినీ పర్మినెంట్‌ చేయాలనీ, పెన్షన్‌, ఈఎస్‌ఐ, పీిఎఫ్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలనే డిమాండ్ల పరిష్కారం కోసం నిరవధికంగా సమ్మె చేస్తున్నారనీ, ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. సమ్మెలో మూడు రంగాల కార్మికులు పేద ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నారనీ, అనేక రకాల ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. వీరంతా సామాజికంగా వెనుక బడిన వారనీ అలాంటి వారిపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తూ అరెస్టులు, అక్రమ కేసులతో భయభ్రాంతుల కు గురిచేస్తున్నారనీ ఇలాంటి చర్యలు తగవని హితవు పలికారు.