ప్రయివేటు సెక్యురిటీ గార్డులకు

For private security guards– వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి
– సీఐటీయూ జాతీయ నాయకులు ఎం.సాయిబాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రయివేటు సెక్యురిటీ గార్డులకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జాతీయ కోశాధికారి, నేషనల్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ సెక్యూరిటీ గార్డ్స్‌, అలైడ్‌ వర్కర్స్‌ యూనియన్స్‌ జాతీయ కన్వీనర్‌ ఎం.సాయిబాబు డిమాండ్‌ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రయివేటు సెక్యూరిటీ గార్డ్స్‌, అలైడ్‌ వర్కర్స్‌ యూనియన్‌ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీల (నియంత్రణ) చట్టం, 2005- అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రయివేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీల కార్యకలాపాలను పర్యవేక్షించ టం కోసం చేశారనీ, ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీల సెంట్రల్‌ మోడల్‌ రూల్స్‌ 2006 సరిగ్గా అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
అనేక ఏజెన్సీలు కార్మికులకు పీఎఫ్‌ చెల్లిండం లేదని తెలిపారు. కనీస వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడి చేస్తున్నారన్నారని విమర్శించారు. మహిళా సెక్యూ రిటీ గార్డులకు ప్రసూతి ప్రయోజనాలు కల్పించాలని చట్టంలో ఉన్నప్పటకీ అమలుకు నోచుకోవడం లేదని ఆవేద వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జీ.వోల్లో ప్రకటించిన విధంగా కనీస వేతనాలు అమలు చేయటం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాన్ని ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల్లో అమలు చేయడం లేదని తెలిపారు. కార్మిక చట్టాలను ప్రభుత్వాలు అమలు చేయటంలో ఉద్దేశ్యపూర్వకంగానే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, మాట్లాడుతూ రాష్ట్రంలో సెక్యూరిటీ కార్మికుల వేతనాలు పెంచుతూ 2021 జూన్‌లో జీవో నెంబర్‌ 21ని ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి ఆ జీవోను గెజిట్‌ చేయకుండా తత్సారం చేస్తున్నారని విమర్శించారు. తక్షణం ఆ జీవోను అమల్లోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. సదస్సుకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె ఈశ్వర్‌రావు అధ్యక్షత వహించగా అపోలో యూనియన్‌ అద్యక్ష, కార్యదర్శులు బి.సత్యనారాయణ, అనురాద, దేవెం దర్‌, నాయకులు స్రవంతి, బుద్ధపూర్ణిమా యూని యన్‌ నాయకులు ఎన్‌ రవి కుమార్‌, ఎం.మధు, చర్లపల్లి పారిశ్రామిక ప్రాంత యూనియన్‌ నాయకులు రామకృష్ణ, జి.రామారావు, వ్యవసాయ మార్కెట్‌ సెక్యూరిటీ గార్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి లక్షణ్‌, హన్మకొండ సెక్యూరిటీ గార్డ్స్‌ నాయకులు వెల్పుల సారంగపాణి పాల్గొన్నారు.