పప్పులకు కొరత తప్పదా?

Is there a shortage of pulses?– కెనడా నుండి తగ్గిన దిగుమతులు
–  దౌత్య ఉద్రిక్తతలే కారణం
న్యూఢిల్లీ : భారత్‌-కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో మన దేశంలో పప్పులకు కొరత ఏర్పడి ధరలు పెరిగే అవకాశం కన్పిస్తోంది. భారత ఇంటెలిజెన్స్‌ ఏజెంట్ల పైన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపణలు చేసిన తర్వాత ఆ దేశం నుండి పప్పుల దిగుమతులు తగ్గిపోయాయి. పప్పులే కాదు…వంట నూనెలు, బఠాణీలు కూడా కెనడా నుండి మన దేశానికి దిగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా ఎర్ర కందిపప్పు కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో కెనడా దిగుమతులు ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయి. అనేక సందర్భాలలో ధరలు స్థిరంగా ఉండడానికి ఈ దిగుమతులు దోహదపడు తున్నాయి. శనగపప్పుకు కొరత ఏర్పడి, ధరలు పెరిగినప్పుడు కూడా కెనడా నుండి దిగుమతుల కారణంగా పరిస్థితి కుదుటపడింది. కెనడా నుండి ఆవనూనె దిగుమతి అవుతుండడంతో వంట నూనెల సరఫరాలో ఎదురవుతున్న కొరత తీరుతోంది. అదే విధంగా అక్కడి నుండి వస్తున్న దాణా చెక్క కోళ్లు, పశువులకు ఆహారంగా ఉపయోగపడుతోంది.
అయితే రెండు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మన దేశంలో కరువు కాటకాలు, అతివృష్టి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగం బాగా దెబ్బతిన్నది. ఉత్తర భారతంలో ఆగస్ట్‌, సెప్టెంబర్‌ నెలల్లో దాదాపు కరువు పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలోని అనేక ఇతర ప్రాంతాలలోనూ ఇదే పరిస్థితి. పప్పులు, చమురు గింజల ఉత్పత్తి పడిపోయింది. ఈ సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం 3% తగ్గిందని అంచనా. మన వద్ద ఉన్న వ్యూహాత్మక నిల్వలు కూడా తరిగిపోతున్నాయి.
మరోవైపు దేశంలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ దశలో ఆహార ధాన్యాల ధరలు ఎంత తక్కువగా ఉంటే పాలక పార్టీలకు అంత మంచిది. అయితే దిగుమతులు చౌకగా లేకపోతే ధరలు తగ్గడం అసంభవం. మరోవైపు కెనడాకు మన దేశం నుండి జరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై కూడా నిశిత పరిశీలన జరుగుతోంది. సుంకాలు విధించి, భారత దిగుమతులను తగ్గించాలని కెనడా భావిస్తోంది. కెనడా ఆహార దిగుమతులపై కూడా మన దేశం అలాంటి ఆంక్షలే విధించవచ్చు. కానీ చివరికి నష్టపోయేది ప్రజలే.
కెనడా నుండి ఆహార ధాన్యాలు, వంట నూనెలే కాదు ఎరువులు కూడా భారత్‌కు ఎగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ను (ఎంఓపీ)ని పెద్ద ఎత్తున మన దేశం దిగుమతి చేసుకుంటోంది. కెనడా నుండి దిగుమతులు ఆగిపోతే దాని ప్రభావం రబీ పంటల సాగుపై పడుతుంది.