నది

నది
ఎప్పుడూ మౌనంగా వుండదు
గలగల మంటూ వుంటుంది

పగలు సూర్యుడూ
రాత్రి చుక్కలూ చంద్రుడూ
నది తో ముచ్చట్లు పెడుతూ వుంటాయి

నది
ఎప్పుడూ నిలకడగా వుండదు
నిరంతరం ప్రవహిస్తూ వుంటుంది

పల్లం జారుడు బండలా
తోసుకెళ్తూ వుంటుంది
చల్లగాలి నది వీపుమీద చరుస్తూ
ముందుకు తోస్తుంది

నిద్ర ఎరుగని నది
తీరాలను ఒరుసుకుంటూ
రాళ్ళనీ రప్పల్నీ వంకల్నీ దొంకల్నీ
దాటుకుంటూ
అలసటనెప్పుడో మర్చిపోయింది

తీరికే లేని నది
తనలో తాను కలవరిస్తూ పలవరిస్తూ
ప్రేమించిన సముద్రుణ్ణి చేరేందుకు
పరుగులు తీస్తూవుంది
కాలం తో పోటీగా నది
కదం తొక్కుతూనే వుంది

– వారాల ఆనంద్‌,
9440501281