– బీఆర్‌ఎస్ ప్రభుత్వ విజయానికి ఈ పుస్తకం చిహ్నం : పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఫలితాలు సాధించాలనుకునే ప్రభుత్వాలకు ‘తెలంగాణ మోడల్’ పుస్తకం ఒక సిలబస్ వంటిదని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు అన్నారు. ఈ పుస్తకం తమ ప్రభుత్వం సాధించిన విజయానికి అక్షరచిహ్నమని చెప్పారు. తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువరించిన ‘తెలంగాణ మోడల్’ పుస్తకాన్ని ఆదివారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తమ ప్రభుత్వం సాధించింది నేటి విజయమే కాదనీ, రేపటి విజయాలకూ దిక్సూచి అని చెప్పారు. కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో ప్రవేశపెట్టిన పథకాలు నేడు దేశానికి ఎలా నమూనా అయ్యాయో ఈ పుస్తకంలో రచయిత పొందు పరిచారని వివరించారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీ శంకర్, శాసన మండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, నవలా రచయిత పెద్దింటి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అమరజ్యోతి డాక్యుమెంటరీని ఆవిష్కరించిన కేటీఆర్
తెలంగాణ అమరువీరుల త్యాగాలను కొని యాడుతూ నిర్మించిన అమరజ్యోతి డాక్యుమెంటరీని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదివారం ఆవిష్కరించారు. పది నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీలో 1969 నుంచి రాష్ట్రావతరణ వరకు సాగిన ఉద్యమచరిత్రలో ప్రాణత్యాగం చేసిన అమరుల ఔన్నత్యాన్ని అద్భుతంగా చిత్రించారు. సమైక్యవాదుల కుట్రల ఫలితంగా యువకులు బలిదానాలకు దారితీసిన నేపథ్యాన్ని, ప్రజలను పోరాటానికి పురికొల్పడం కోసం ప్రాణాలు త్యాగం చేసిన విద్యార్థి వీరుల త్యాగనిరతిని గుండెలు కదిలించేలా ఈ డాక్యుమెంటరీ వివరిస్తుందని కేటీఆర్ అన్నారు. దీనికి రచన, వ్యాఖ్యానం చేసిన శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్, దర్శకులు బాదావత్ పూర్ణచందర్‌ను మంత్రి అభినందించారు. ఇదే సందర్భంలో తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ వ్యాసాల సంకలనం ‘నడక’ పుస్తకాన్ని, పర్యావరణ పారిశుధ్య అంశాలపై డాక్టర్ గాదె వెంకటేశ్ రాసిన ‘కసువు’ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.