ఆద్యంతం నవ్వుల హంగామా

Laughter all roundయువ నటీనటులు నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌ కుమార్‌, గోపికా ఉద్యాన్‌ నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘మ్యాడ్‌’. కళ్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.
ప్రధాన నటీ నటులు సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌, గోపికా ఉద్యన్‌ మంగళవారం మీడియాతో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
సంగీత్‌ శోభన్‌ మాట్లాడుతూ, ‘నాగ వంశీ ఒక హాస్యభరితమైన కథ ఉందని నన్ను సంప్రదించారు. కేవలం ఐదు నిమిషాల కథలోనే కాలేజీ వైబ్‌, కామెడీ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పైగా టాలీవుడ్‌లో ఇలాంటి కథ వచ్చి చాలా సంవత్సరాలైంది’ అని అన్నారు.
‘యూట్యూబ్‌ సిరీస్‌లతో నా నటనా జీవితాన్ని ప్రారంభించాను. ఆ తర్వాత, హలో వరల్డ్‌ అనే సిరీస్‌ చేశాను. అది విడుదలైన రెండు రోజుల్లోనే నాగ వంశీ నుంచి నాకు కాల్‌ వచ్చింది. ఒక ప్రముఖ ప్రొడక్షన్‌ హౌస్‌ నుండి ఆఫర్‌ రావడం, స్క్రిప్ట్‌ నచ్చడంతో వెంటనే ఓకే చేశాను’ అని రామ్‌ నితిన్‌ చెప్పారు.
గోపికా ఉద్యన్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేస్తున్నాను. ఆసిఫ్‌ అలీతో మలయాళంలో ఓ ఫీచర్‌ ఫిల్మ్‌ చేశాను’ అని తెలిపారు.
ఈ సినిమా ఈనెల 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో ఎన్టీఆర్‌ విడుదల చేశారు. ఆద్యంతం వినోదంతో ఉన్న ట్రైలర్‌ తనకు ఎంతగానో నచ్చిందని చెప్పిన ఆయన చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.