వెయ్యిసార్లు దాడులు చేసినా..

Even if you attack a thousand times..–  ఒక్కపైసా కూడా గుర్తించలేకపోయారు : కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ : ఆప్‌ నేత సంజరు సింగ్‌కు మద్దతుగా మోడీ ప్రభుత్వంపై ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ బుధ వారం విరుచుకుపడ్డారు. కేంద్రం వెయ్యిసార్లకు పైగా సోదాలు జరిపినా అక్రమ సంపాదన కింద ఒక్క పైసాను కూడా గుర్తించలేక పోయారని అన్నారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసుకు సంబంధించి ఆప్‌ నేత సంజరు సింగ్‌ నివాసంలో బుధవారం ఉదయం నుండి సోదాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ” గత ఏడాది కాలంగా చూస్తున్నాం. మద్యం కుంభకోణం పేరుతో కేంద్రం హాడావిడీ చేస్తోంది. వెయ్యికి పైగా దాడులు నిర్వహించగా.. ఒక్క పైసా కూడా రికవరీ కాలేదు” అని అన్నారు.
ఏడాది కాలంగా కేంద్రం ‘స్కామ్‌’ అని ఆరోపిస్తూనే ఉన్నారని..తాను విచారణ చేసానని.. స్కామ్‌ జరగలేదని అన్నారు. సంజరు సింగ్‌ నివాసంలోనూ ఏమీ గుర్తించలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రానికి ఓడిపోతామనే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. దీంతో ఓడిపోయే (అధికార) పక్షం చివరి ప్రయత్నంగా ఈ దాడులు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రతిపక్షనేతలతో పాటు ప్రత్యర్థులను, విమర్శకులను వేధించేందుకు మోడీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని మండిపడ్డారు. న్యూస్‌ క్లిక్‌ కార్యాలయంపై దాడులు కూడా ఇందులో భాగమేనని పేర్కొన్నారు. ” నిన్న జర్నలిస్టులపై దాడులు చేశారు. ఈ రోజు సంజరు సింగ్‌ వంతు.. ఎన్నికల వరకు ఆగండి…దాడులు ఇంకా తీవ్రతరం కావచ్చు’ అని అన్నారు.