బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీ పెడతామని మోడీ చెప్పలేదు

– కేసీఆర్‌, కేటీఆర్‌నే చెప్పారు.. హామీని నిలబెట్టుకోండి
– అభివృద్ధి పనుల ప్రారంభానికి ప్రధాని వస్తే టూరిస్టు అంటారా? : కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీ పెడతామని ప్రధాని నరేంద్ర మోడీ ఏనాడూ చెప్పలేదనీ, గత ఎన్నికల్లో అక్కడ ఫ్యాక్టరీ పెడతామని కేసీఆర్‌ ప్రభుత్వమే హామీ ఇచ్చింది కాబట్టి ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పా లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టాలంటే ప్రజల ధనంతో పెట్టాలన్నారు. ప్రపంచంతో పోటీ పడి స్టీలు తయారీ చేయాలంటే అది సాధ్యం కాదని కమిటీలు చెప్పాయన్నారు. విశాఖ స్టీలు కంపెనీ కొంటామన్న మాటలు ఏమయ్యాయని కేసీఆర్‌ను ప్రశ్నించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి అభివృద్ధి కార్యక్రమాల ను ప్రారంభించడానికి వస్తే మోడీని పట్టుకుని టూరిస్టు అని మాట్లాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఢిల్లీని ప్రధాని వస్తాడని తెలిసినా, ఆహ్వానం ఉన్నా రాకుండా ఫాంహౌజ్‌, ప్రగతిభవన్‌ లలో పండేటోళ్లకు మోడీని విమర్శించే హక్కు లేదన్నారు. గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు, క్రిష్ణా ట్రిబ్యునల్‌కు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింద న్నారు. గిరిజన రిజర్వేషన్ల పొరపాటు, యూనివర్సిటీ ఏర్పాటు తాత్సారానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని విమర్శించారు. కానీ, కేంద్రాన్ని బదనాం చేయడంలో కేసీఆర్‌కున్నంత తెలివి ఎవరికీ లేదనీ, అబద్దాలు ఆడే విషయంలో కేసీఆర్‌ కుటుంబానికి ఆస్కార్‌, నోబెల్‌ అవార్డులను ఇవ్వొచ్చని అన్నారు. కృష్ణా ట్రిబ్యునల్‌ ఆలస్యానికీ కేసీఆర్‌నే కారణమన్నారు. సీఎం కేసీఆర్‌ వైఖరి వల్లనే కృష్ణా ట్రిబ్యునల్‌ విషయంలో ఆలస్యం జరిగిందన్నారు. దీనివల్ల ప్రాజెక్టు వ్యయం రూ.22 వేల కోట్లు పెరిగిందని చెప్పారు. కేసీఆర్‌ తీరు వల్లనే కృష్ణా జలాల వాటా విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. మన నీళ్లు, మన కొలువులు మనకే అని సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం నీళ్ల, నిధులు, నియామకాల విషయంలో బాధ్యతారాహిత్యం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఉద్యోగాల విషయంలో యువతకు వెన్నుపోటు పొడించిందన్నారు.