నేటి నుంచి సాగర్‌ ఎడమకాల్వకు నీటి విడుదల

– సీఎం కేసీఆర్‌ నిర్ణయం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు శుక్రవారం నుంచి నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈమేరకు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని నాగార్జునసాగర్‌ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడంతో వేసిన వరిచేను దెబ్బతినే ప్రమాదం ఉందనీ, ఆ ప్రాంతాల రైతాంగం, శాసనసభ్యులు, మంత్రులు గత నాలుగైదు రోజుల నుంచి ముఖ్యమంత్రికి పలు విజ్ఞప్తులు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఇరిగేషన్‌ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో సాగర్‌ ఎడమ కాలువ కింద వరి పంటలకు సాగునీరు అందించే విషయంపై ప్రత్యేకంగా చర్చించారు. తెలంగాణ వాటా కింద కష్ణాజలాలలో మన నీరు ఉన్న నేపథ్యంలో, శుక్రవారం నుంచి నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ కింద ఉన్న వరి పొలాలకు నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరో 20 రోజుల తర్వాత ఇంకో తడి కోసం నీటిని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. వానల్లేక సాగర్‌ రిజర్వాయర్‌లో ఆశించిన మేరకు నీటి నిల్వలు లేని కారణంగా, సాగునీటిని ఒడుపుగా పొదుపుగా వాడుకొని వరిపంటను కాపాడుకోవాలని సీఎం కేసీఆర్‌ రైతాంగానికి పిలుపునిచ్చారు. సాగర్‌ ఎడమకాలువ నీళ్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో, ఆయా జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాలలో పర్యవేక్షిస్తూ, రైతుల చివరి పొలాలకు, చివరి ఆయకట్టు దాకా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.