పసిడితో పారిస్‌కు!

To Paris with passion!– హాకీ ఇండియాకు గోల్డ్‌ మెడల్‌
– రెజ్లింగ్‌లో మూడు కాంస్యాలు
– సెపక్‌తక్రాలో చారిత్రక పతకం
– హాంగ్జౌ ఆసియా క్రీడలు 2023
హాకీ ఇండియా అదరగొట్టింది. ఆసియా క్రీడల్లో అత్యధిక పసిడి పతకాలు అందుకున్న రెండో జట్టుగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో జపాన్‌ను చిత్తు చేసిన మెన్స్‌ జట్టు.. పసిడి పతకంతో పాటు 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ కైవసం చేసుకున్నారు. మల్లయోధులు కాంస్య పట్టుతో మెరువగా.. సెపక్‌తక్రాలో అమ్మాయిలు చారిత్రక పతక ప్రదర్శన చేశారు. షట్లర్‌ ప్రణరు కాంస్యంతో సరిపెట్టుకోగా.. సాత్విక్‌, చిరాగ్‌ జోడీ పసిడి వేటకు సిద్ధమైంది. 22 పసిడి, 34 రజతాలు, 39 కాంస్యాలతో ఓవరాల్‌గా 95 మెడల్స్‌ సాధించిన భారత్‌.. పతకాల పట్టికలో నాల్గో స్థానంలో నిలిచింది.
నవతెలంగాణ-హాంగ్జౌ
ఆసియా క్రీడల్లో హర్మన్‌ప్రీత్‌సేన చాంపియన్‌గా అవతరించింది. పసిడి పోరులో జపాన్‌ను 5-1తో చిత్తుచేసి గోల్డ్‌ మెడల్‌తో పాటు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆసియా క్రీడల్లో నాల్గో పసిడి పతకం సాధించిన టీమ్‌ ఇండియా.. అత్యధిక గోల్డ్‌ నెగ్గిన జట్ల జాబితాలో జపాన్‌తో సమానంగా నిలిచింది. స్వర్ణమే లక్ష్యంగా ఆసియా క్రీడలకు వచ్చిన హర్మన్‌ప్రీత్‌ సేన.. ఆరంభం నుంచీ దుమ్మురేపింది. గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచి.. నాకౌట్‌లోనూ చెలరేగింది. శుక్రవారం నాటి ఫైనల్లో జపాన్‌ను 5-1తో ఓడించింది. తొలి క్వార్టర్‌లో 0-0తో గోల్‌ నమోదు కాలేదు. రెండో క్వార్టర్‌లో మన్‌ప్రీత్‌ సింగ్‌ 25వ నిమిషంలో గోల్‌ సాధించి బ్రేక్‌ సాధించాడు. మూడో క్వార్టర్‌లో మనోళ్లు మరింత రెచ్చిపోయారు. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 32వ నిమిషంలో, రోహిదాస్‌ 36వ నిమిషంలో గోల్స్‌ నమోదు చేసి భారత్‌ ఆధిక్యాన్ని 3-0కు మెరుగుపర్చారు. చివరి క్వార్టర్‌లో భారత్‌ మరో రెండు గోల్స్‌ కొట్టగా.. జపాన్‌ ఓ ఊరట గోల్‌ నమోదు చేసింది. 48వ నిమిషంలో అభిషేక్‌ గోల్‌ కొట్టగా.. 59వ నిమిషంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ మరో గోల్‌ సాధించాడు. జపాన్‌ తరఫున 51వ నిమిషంలో తనక ఓ గోల్‌ కొట్టాడు. బలమైన జపాన్‌ను నాలుగు గోల్స్‌ తేడాతో చిత్తుగా ఓడించిన హాకీ ఇండియా.. పసిడి పతకం సొంతం చేసుకుంది. కాంటినెంటల్‌ ఈవెంట్‌ విజేతగా నిలిచి విశ్వ క్రీడలకు నేరుగా అర్హత సాధించింది.
సిల్వర్‌ షో : బ్రిడ్జ్‌ (కార్డ్స్‌ గేమ్‌)లో భారత మెన్స్‌ జట్టు రజత పతకం సాధించింది. సెమీఫైనల్లో చైనాను ఓడించి పసిడి ఫేవరేట్‌గా నిలిచిన భారత్‌.. బంగారు పతక వేటలో రజతంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో హాంగ్‌కాంగ్‌ చేతిలో 238.1-152తో భారత్‌ పరాజయం పాలైంది. భారత జట్టులో రాజు తోరణి, అజరు ప్రభాకర్‌, రాజేశ్వర్‌ తివారి, సుమిత్‌ ముఖర్జీలు సిల్వర్‌తో మెరిశారు. 2018 జకర్తా ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన బ్రిడ్జ్‌ మెన్స్‌ జట్టు ఈసారి పతకం రంగు మెరుగుపర్చుకుంది.ఇక ఆర్చరీలో రికర్వ్‌ జట్టు సైతం పతకాల పంట పండించాయి. మెన్స్‌ రికర్వ్‌ జట్టు సిల్వర్‌ మెడల్‌ సాధించగా.. ఉమెన్స్‌ జట్టు కాంస్యం నెగ్గింది. దక్షిణ కొరియాతో పసిడి పోరులో మన ఆర్చర్లు అంచనాలను అందుకోలేదు. తొలి రౌండ్‌లో 55-60, చివరి రౌండ్‌లో 55-56తో వెనుకంజ వేసిన అటాను దాస్‌, బొమ్మదేవర ధీరజ్‌, ప్రభాకర్‌లు 1-5తో బంగారు పతకం దక్షిణ కొరియాకు కోల్పోయారు. మహిళల రికర్వ్‌ జట్టు అంకిత, భజన్‌, సిమ్రన్‌జిత్‌లు కాంస్య పతక వేటలో వియత్నాంపై 6-2తో గెలుపొందారు. 56-52, 55-56, 57-50తో మన ఆర్చర్లు పైచేయి సాధించి పతకం సొంతం చేసుకున్నారు.
రెజ్లర్ల కాంస్య పట్టు : రెజ్లింగ్‌లో భారత స్టార్‌ మల్లయోధుడు బజరంగ్‌ పూనియా పతకం లేకుండానే ఇంటిముఖం పట్టగా.. శుక్రవారం పోటీల్లో భారత్‌కు మూడు కాంస్య పతకాలు లభించాయి. మహిళల 62 కేజీల ఫ్రీస్టయిల్‌ విభాగం కాంస్య పతక పోరులో సోనమ్‌ 7-5తో చైనా రెజ్లర్‌పై విజయం సాధించింది. టెక్నికల్‌ ఆధిపత్యంతో సోనమ్‌ కాంస్య పతకం సొంతం చేసుకుంది. మహిళల 76 కేజీల విభాగంలో కిరణ్‌ మరో మెడల్‌ సొంతం చేసుకుంది. ఫ్రీస్టయిల్‌ బ్రాంజ్‌ మెడల్‌ బౌట్‌లో మంగోలియా రెజ్లర్‌పై గెలుపొంది మెడల్‌ సాధించింది. పురుషుల 57 కేజీల విభాగం కాంస్య పతక పోరులో ఆమన్‌ మెరిశాడు. 11-0తో చైనా రెజ్లర్‌ మిగు లిని చిత్తు చేశాడు. టెక్నికల్‌ సుపిరియారిటీతో ఆమన్‌ మెడల్‌ సొంతం చేసుకున్నాడు. మెన్స్‌ 65 కేజీల ఫ్రీస్టయిల్‌లో బజరంగ్‌ పూనియా 0-10తో జపాన్‌ రెజ్లర్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు.
సెపక్‌తక్రాలో చారిత్రక మెడల్‌ : సెపక్‌తక్రాలో టీమ్‌ ఇండియా చారిత్రక పతకం సాధించింది. రెగు మహిళల విభాగంలో భారత్‌ కాంస్య పతకం సాధించింది. ఆసియా క్రీడల చరిత్రలోనే సెపక్‌తక్రాలో భారత్‌కు ఓ మెడల్‌ రావటం ఇదే ప్రథమం. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టీమ్‌ ఇండియా వరుస సెట్లలో 0-2తో ఓటమిపాలైంది. 30 నిమిషాల్లోనే ముగిసిన సెమీఫైనల్లో 10-21, 13-21తో టీమ్‌ ఇండియా అమ్మాయిలు పోరాడి ఓడారు. ఇక కబడ్డీలోనూ భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించాయి. మహిళల విభాగంలో సెమీస్‌లో నేపాల్‌పై 61-17తో భారత్‌ గెలుపొందగా.. మెన్స్‌ విభాగంలో 61-14తో ఏకపక్ష విజయంతో టీమ్‌ ఇండియా పసిడి పోరుకు చేరుకుంది. ఈ రెండు విభాగాల్లోనూ టీమ్‌ ఇండియా కనీసం రజత పతకాలు ఖాయం చేసుకుంది.
పసిడి వేటకు సాత్విక్‌, చిరాగ్‌ : భారత డబుల్స్‌ స్టార్‌ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ పసిడి వేటకు సిద్ధమయ్యారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌ జోడీ ఫైనల్లోకి ప్రవేశించారు. మలేషియా జోడీ ఆరోన్‌, వూ యిక్‌లపై వరుస గేముల్లో మనోళ్లు గెలుపొందారు. 24 నిమిషాల్లోనే తొలి గేమ్‌ను 21-17తో.. రెండో గేమ్‌ను 21-12తో 23 నిమిషాల్లోనే ముగించారు. మెన్స్‌ డబుల్స్‌ ఫైనల్లోకి ప్రవేశించి కనీసం రజత పతకం ఖాయం చేసుకున్నారు. ఇదిలాఉండగా, భారత సీనియర్‌ షట్లర్‌ హెచ్‌.ఎస్‌ ప్రణరు చరిత్ర సృష్టించాడు. సయ్యద్‌ మోడీ (1992) బ్యాడ్మింటన్‌ మెన్స్‌ సింగిల్స్‌ ఆసియా క్రీడల మెడల్‌ సాధించిన తొలి భారత షట్లర్‌గా నిలిచాడు. చైనా షట్లర్‌తో జరిగిన సెమీఫైనల్లో నిరాశపరిచిన హెచ్‌.ఎస్‌ ప్రణరు కాంస్య పతకం సాధించాడు. లి సిఫెర్స్‌ 21-16, 21-19తో వరుస గేముల్లో ప్రణరుపై విజయం సాధించాడు. తొలి గేమ్‌ను 27 నిమిషాల్లో, రెండో గేమ్‌ను 24 నిమిషాల్లో చేజార్చుకున్న ప్రణరు కాంస్య పతకంతో ఆసియా క్రీడలను ముగించాడు.