వ్యాధులు సోకకుండా పశువులను కాపాడుకోవాలి

– జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఈవో రఘుబాబు 
– గర్భకోశం సమస్యలపై పోచంపల్లిలో పశువైద్య శిబిరం
నవతెలంగాణ పెద్దవంగర:
పశువులకు వ్యాధులు సోకకుండా రైతులు పశుసంపదను కాపాడుకోవాలని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణాధికారి రఘుబాబు, మండల పశువైద్యాధికారి రాజశేఖర్ అన్నారు. శనివారం పోచంపల్లి గ్రామంలో గర్భకోశం సమస్యలపై పశువైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ, విజయ డైరీ, ఇంటస్ ఆధ్వర్యంలో పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, సీజనల్‌ వ్యాధులు సోకకుండా మినరల్ మిక్చర్, నట్టల మందులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన పశుసంపదను పెంపొందించుకునేందుకు పశు వైద్యశాఖ డాక్టర్లను సంప్రదించి తగిన సూచనలు సలహాలు తీసుకోవాలన్నారు. వ్యవసాయంతో పాటుగా గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపకం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకొని అన్నదాతలు ఆర్థిక పరిపుష్టి సాధించాలని తెలిపారు. వ్యవసాయ అనుబంధ పాడిపరిశ్రమ పై రైతులు దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో తొర్రూరు డైరీ చైర్మన్ రాసాల సమ్మయ్య, గోపాల మిత్రులు వెంకన్న యాదవ్, శేఖర్, యాకుబ్, మధు, మురళి, ఇంటస్ కంపెనీ ప్రతినిధులు లవన్ కుమార్, బిక్షపతి, రైతులు తదితరులు పాల్గొన్నారు.