ఇక ఆర్‌బీఐలోనే రూ.2వేల నోట్ల మార్పిడి

And in RBI itself Exchange of Rs.2 thousand notes– బ్యాంక్‌ల్లో ముగిసిన గడువు
న్యూఢిల్లీ : బ్యాంక్‌ల్లో రూ.2,000 నోట్ల మార్పిడికి శనివారంతో గడువు ముగిసింది. ఇకపై ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనే పెద్ద నోట్ల మార్పిడికి అవకాశం ఉంటుందని రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. ఇంకా మార్కెట్‌లో రూ.12వేల కోట్ల విలువ చేసే రూ.2,000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. అవి ఇంకా బ్యాంకులకు చేరలేదు. తొలుత సెప్టెంబర్‌ 30 వరకూ రూ.2000 నోట్‌ మార్పిడి లేదా డిపాజిట్‌కు అవకాశం ఇచ్చిన రిజర్వ్‌ బ్యాంక్‌ తర్వాత ఆ గడువును ఈ నెల అక్టోబర్‌ ఏడో తేది వరకు పొడిగించింది. సోమవారం నుంచి ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల వద్ద మాత్రమే మార్చుకునేందుకు వీలు ఉంది. దేశ వ్యాప్తంగా ఆర్‌బీఐకి 19 ప్రాంతీయ కార్యాలయాల్లో ఒకేసారి రూ.20 వేల వరకూ డిపాజిట్‌ లేదా మార్పిడి చేసుకోవచ్చు. వీలు కాని వారు పోస్టాఫీసుల ద్వారా కూడా ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు రూ.2000 నోట్లు పంపడానికి వీలు కల్పించింది. అనంతరం ఆ మొత్తం ఖాతాదారుల బ్యాంక్‌ ఎకౌంట్‌లో డిపాజిట్‌ అవుతుంది. ఇప్పటి వరకూ 96 శాతం రూ.2000 నోట్లు ఆర్‌బీఐకి తిరిగి వచ్చాయి.