కామారెడ్డిలో కేసీఆర్‌ గెలుపు ఖాయం

In Kamareddy KCR's victory is certain– విభేదాలు పక్కన పెట్టి పనిచేయండి
– ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయండి : బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేటీఆర్‌ దిశానిర్దేశం
నవతెలంగాణ-కామారెడ్డి
రాష్ట్రంలో ఏ పార్టీ ప్రకటించక ముందే బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించిందని, ముఖ్యంగా కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తుండటంతో దేశం చూపు కామారెడ్డి వైపు నిలిచిందని ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మినీ స్టేడియం నిర్మాణానికి శనివారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, విప్‌ గంపగోవర్ధన్‌, ఎంపీ బీబీపాటిల్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. విభేదాలు పక్కన పెట్టి బీఆర్‌ఎస్‌ పథకాలపై ఇంటింటి ప్రచారం చేయాలని సూచించారు. ఇప్పటివరకు ప్రజలకు పంపిణీ చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, జీవన భృతి, రైతుబంధు తదితర పథకాలు తీసుకుంటున్న ప్రజలకు వాటిపై ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంచి వారికి అర్థమయ్యే విధంగా చెప్పి లక్ష ఓట్ల మెజార్టీ సాధించే దిశగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో 26 బూత్‌లు ఉన్నాయని, ఆయా బూత్‌లలో ప్రతి గ్రామంలో సోషల్‌ మీడియా గ్రామ కోఆర్డినేటర్‌ను నియమించాలని తెలిపారు. సీఎం కేసీఆర్‌ పంపించే వాయిస్‌ మెసేజ్‌లు సైతం ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి వినేలా చూడాలన్నారు. విప్‌ గంపగోవర్ధన్‌ కోరిక మేరకే సీఎం కేసీఆర్‌ కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ నాయకుడైనా పదవుల కోసం కొట్లాడుతారని కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తన సీటును వదులుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్‌ గెలుపు ఖాయమని, కేవలం అత్యధిక మెజారిటీ కోసమే మనం పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ గెలుస్తారనడానికి వివిధ గ్రామాల్లో చేసిన ఏకగ్రీవ తీర్మానాలే నిదర్శనమన్నారు. ప్రస్తుతం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న షబ్బీర్‌ అలీ.. 2004 ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ పొత్తులో.. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రచారానికి కేసీఆర్‌ను పిలిచారని గుర్తుచేశారు. తెలంగాణ ఎన్నికల కోసం మహారాష్ట్ర ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ చైర్మెన్లు తెలంగాణ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ చేస్తున్న పథకాలు అమలు చేసే నాయకుడు వారి రాష్ట్రానికి కూడా కావాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.