బీజేపీ కూటమిని ఓడించడమే లక్ష్యం

BJP coalition The goal is to defeat– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ-ఖమ్మం
దేశవ్యాప్తంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ దాని కూటమి పార్టీలను ఓడించడమే లక్ష్యంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తమ వైఖరిని స్పష్టంచేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నండ్ర ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన పాలేరు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి తమ్మినేని హాజరై మాట్లాడారు. దేశంలో కచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, దానికి కారణం బీజేపీ అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలేనని అన్నారు. రాష్ట్రంలో కూడా ఇండియా కూటమిగానే పని చేస్తామని, కలిసి వచ్చే పార్టీలతో ఎన్నికల్లో ముందుకు పోతామని తెలిపారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని, కచ్చితంగా ఈసారి కేంద్రంలో, రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో అనేక సమస్యల మీద ప్రజలు బయటికి వచ్చి ఉద్యమాల్లో పాల్గొంటున్నారని, ఈ ఉద్యమాల ప్రభావం కచ్చితంగా ఎన్నికల్లో ఉంటుందన్నారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేయడానికి పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, ప్రతి సమస్య మీద రాజీలేని పోరాటం చేయాలని తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్‌, భూక్య వీరభద్రం, వై.విక్రమ్‌, జిల్లా కమిటీ సభ్యులు ఎర్రా శ్రీనివాసరావు, షేక్‌ బషీరుద్దీన్‌, సుదర్శన్‌రెడ్డి, కొమ్ము శ్రీను, గుడవర్తి నాగేశ్వరరావు, దొంగల తిరుపతిరావు, పిన్నింటి రమ్య, మండల కార్యదర్శులు ఎడవల్లి రమణారెడ్డి, బోడపట్ల సుదర్శన్‌, ఎండి గౌస్‌, బాపట్ల సత్యనారాయణ, అంజయ్య, నాయకులు పొన్నెకంటి సంగయ్య, నందిగామ కృష్ణ, తమ్మినేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.