పిల్లలను అడ్డంపెట్టుకుని రాజకీయాలా?

Politics by blocking children?– సీఎం అల్పాహారాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి
– మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
– సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని టీపీసీసీ చీఫ్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శనివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. పాఠశాలల్లో కనీస సౌకర్యాల్లేవనీ, మధ్యాహ్న భోజన కార్మికులకు సక్రమంగా బిల్లులు చెల్లించడం లేదని విమర్శించారు. పెరిగిన ధరలకనుగుణంగా వంట నిర్వహణ ఖర్చులు చెల్లించడం లేదని తెలిపారు. గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేయకపోవడంతో కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నారనీ, రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం అమలవుతున్న తీరు ఇదని పేర్కొన్నారు. సవాలక్ష సమస్యలతో మధ్యాహ్న భోజన పథకం అభాసు పాలవుతుంటే ఇవేమీ పట్టించుకోకుండా సీఎం అల్పాహారమంటూ హడావుడి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో సమస్యలను పట్టించుకోకుండా చదువుకుంటున్న పిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే స్థితికి దిగజారారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచడంతోపాటు పౌష్టికాహారం అందించాలనే సదుద్దేశంతో చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం ఈ ప్రభుత్వంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నదని తెలిపారు. మార్కెట్‌లో ధరలు భగ్గుమంటుంటే ప్రభుత్వం పెరిగిన ధరలకనుగుణంగా బడ్జెట్‌ పెంచాల్సి ఉండగా వాటిని సవరించడం లేదని పేర్కొన్నారు. మెనూలో మార్పులు చేయడం వల్ల వంట కార్మికులకు ఆర్థిక భారంతోపాటు పనిభారం పెంచుతోందని విమర్శించారు. చాలా పాఠశాలల్లో వంట గదులే సక్రమంగా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నిర్మించినా ఇరుకుగా ఉండడం, శిథిలావస్థకు చేరడం వంటి కారణాలతో ఆరు బయట, చెట్ల కింద వంటలు కొనసాగుతున్నాయని వివరించారు. దీనివల్ల అక్కడక్కడ మధ్యాహ్న భోజనం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురైన సందర్భాలున్నాయని తెలిపారు. సమస్యలను పరిష్కరించాలంటూ మధ్యాహ్న భోజన కార్మికులు గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. పెంచిన జీతాన్ని విడుదల చేయాలనీ, నూతన మెనూకు బడ్జెట్‌ పెంచాలనీ, పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలనీ, జీవోనెంబర్‌ ఎనిమిది ప్రకారం పెరిగిన వేతనాలను బకాయిలతో సహా వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు గుర్తింపు కార్డులు, యూనిఫారాలివ్వాలనీ, నిత్యావసర వస్తువులను ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సరిగ్గా అమలు చేయడం లేదనీ, సీఎం అల్పాహార పథకాన్ని ప్రచార ఆర్భాటానికి పాల్పడుతూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.