సమ్మోహం!

Seduction!సుందరమైన నీ మేధో సంధ్యలో
సంపూర్ణ వికాసానికై సంగమిస్తున్న
రెండు రంగుల చంద్రకాంతనౌతాను
వెల్లువైన నీ జ్ఞాన వెన్నెలలో
శశాంక కలయికకై కాంక్షిస్తున్న
కొలనులో కనబడని కలువనౌతాను

పుప్పొడై ప్రకాశిస్తున్న నీ పసిడి ప్రతిభలో
పర పరాగ సంపర్కానికై పరితపిస్తున్న
బిడియం లేని బీర పువ్వునౌతాను

ఆర్ద్రతే ఆరుణమైన నీ కరుణాకాశంలో
వర్ణాల వంపుకై నీరెండతో రమిస్తున్న
నిలకడ లేని నీటి బిందువునౌతాను
పొగమంచై ముంచెత్తిన నీ ముగ్ధ మోహంలో
మొదటి ముద్దుకై మధన పడుతున్న
తడి ఆరని తరుల పెదవినౌతాను
ఔను నిన్ను మోహిస్తున్నాను
– మాలతి పల్లా