విత్తన పితామహుడు

The seed fatherఅందరూ ఆకాశం పైకి నడిచారు
అతడు నేల కిందికి నడిచాడు
నేలలో మొలకెత్తే సుగుణానికి నలుగులద్దాడు

ఎన్ని కలలు గెలిచినా
ఆకలి కలను గెలవడం అద్భుత విజయం
ఎన్ని వెలుగుల్ని నిలబెట్టినా
బతుకు వెలుగు పూయడం సంతోషం
ఎన్ని కాలాలు నడిచినా
సేద్యపు కాలాన్ని నడిపియ్యటం ఈ శతాబ్దపు వికాసము

అతను వెళ్ళిపోయాడు
అనేక వంగడాలుగా నిలిచిపోయాడు
దేశం కన్నీళ్లు తూడ్సడానికి అనేక పరిశోధనలై ప్రవహించాడు కరువుకు మరణ శాసనం రాసిన హరిత విప్లవ పితామహుడు

కొత్త కొత్త దారుల్లో కొత్త కొత్త విత్తనాలు
అనేక నీడల సమూహం
పొలాలలో పరిశోధనలకై పరితపించాడు
సేద్యపు పరిమళాలతో పూదోట
వ్యవసాయ విప్లవానికి ఆది

గుప్పెడు గింజలకు చేతులను చాచనీయలే
అనేక దిగుబడులకు నారుపోసాడు
రణం చేశాడు యుద్ధం చేశాడు
మొక్క కోసం జీవ పరిణామం కోసం
పర్యావరణ హితం కోసం సమరం చేశాడు
అతను పొలం బడిలో చదువుకున్నాడు
ఉద్యోగాల ఉజ్వల భవిష్యత్‌ తలుపుతట్టినా
వ్యవసాయ ఉద్యోగమే చాలనుకున్నాడు
పురుగులా
మొక్కను తిని బతుకాలనుకోలే
మొక్కై నేలమీద చిగురించాలనుకున్నడు
కనీస మద్దతు ధరకై కలకన్నాడు

రాత్రి అయిందని నిద్రించలేదు
పగలు అయిందని సేద తీరలేదు
నిరంతరం తపన తపన తపన
ఆకలికి చరమగీతం పాడాలనేదే అతని తపన …
రైతు పంటకు తండ్రి
స్వామినాథన్‌ విత్తనానికీ పితామహుడు

పంటకంకుల కన్నందుకు
పొలము తల్లి సంతోష పడ్డది
స్వామినాథన్‌ ను కన్నందుకు
భారత దేశం గర్విస్తున్నది
ఎం.ఎస్‌ .స్వామినాథన్‌ స్మతిలో
– వనపట్ల సుబ్బయ్య, 9492765358