నయా సరళీకరణతో దేశానికి ప్రమాదం

Risk to the country with neoliberalisation– విదేశీ పెట్టుబడులపై ఆధారపడడం మంచిది కాదు
–  కీలక రంగాలకు ప్రభుత్వ మద్దతు అవసరం : ఆర్థికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌
కొల్‌కతా : నయా సరళీకరణ వ్యూహం కొనసాగితే దేశం ప్రమాదంలో పడుతుందని, ఆహారోత్పత్తి, విద్య, ఆరోగ్య రంగాలు దెబ్బతింటాయని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌ హెచ్చరించారు. ‘ప్రస్తుత పరిస్థితులలో దేశ స్వావలంబన’ అనే అంశంపై కలకత్తా యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్‌ హాలులో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారుల ప్రయోజనాల కంటే దేశ పౌరుల అవసరాలను పరిశీలించాలని సూచించారు. సంపన్నులపై భారీగా పన్నులు విధించకపోతే దేశంలోని పేద ప్రజల పరిస్థితులు మారబోవని చెప్పారు. ఇదే సందేశాన్ని దేశంలోని వామపక్షవాదులు పదే పదే ఇస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. పశ్చిమబెంగాల్‌ సైన్స్‌ ఫోరమ్‌, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులతో కూడిన వేదిక (ఎఫ్‌ఓఎస్‌ఈటీ) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి.
‘ఉత్పత్తి, దేశీయ వనరులను దేశ ప్రజల కోసమే పూర్తిగా వినియోగించాలి. విదేశాల నుండి డబ్బు వస్తే దేశంలో ఆదాయం ఉండదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దేశం మరింత వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తిని సాధించాల్సిన అవసరం ఉంది. దేశాన్ని నడిపేందుకు మనం విదేశీ పెట్టుబడులపై ఆధారపడితే, ఆ సొమ్ము దేశాన్ని విడిచి వెళితే అప్పుడు ప్రజలు రోడ్ల మీద కూర్చోవాల్సి వస్తుంది. ప్రస్తుత పరిస్థితి దీనినే సూచిస్తోంది’ అని ప్రభాత్‌ పట్నాయక్‌ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆయన మాట్లాడుతూ ఎగుమతులు తగ్గిపోయాయని, రూపాయి విలువ పడిపోతోందని చెప్పారు. ‘ప్రపంచంలోనే ఆర్థిక పురోగతికి అవరోధాలు ఎదురవుతున్నాయి. దేశానికి ఆహార స్వయంసమృద్ధి అవసరం. అయితే ఆహారోత్పత్తిలో దేశం వెనుకబడుతోంది. దేశంలోని చాలా భూమి, వనరులు వృథాగా పడి ఉన్నాయి. అవి ఉపయోగంలో లేవు. మరోవైపు ప్రభుత్వమేమో సబ్సిడీలను ఉపసంహరిస్తోంది. దీంతో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి’ అని వివరించారు. విదేశీ మారక లావాదేవీల ద్వారా ప్రభుత్వం ఖరీదైన ఉత్పత్తులపై దృష్టి పెడితే ప్రజల ముందు పెను ప్రమాదం కన్పిస్తుందని ప్రభాత్‌ అన్నారు. ‘ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. రైతులకు కొనుగోలు శక్తి ఉండదు. దీనివల్ల దేశం స్వావలంబన సాధించడం సాధ్యం కాదు. పరిశ్రమ, వ్యవసాయం వంటి కీలక రంగాలకు ప్రభుత్వ మద్దతు అవసరం’ అని చెప్పారు.
విద్యను ప్రైవేటీకరించడం ప్రమాదకరమ ని ప్రభాత్‌ హెచ్చరించారు. విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో దేశ చరిత్ర, సంస్కృతికి ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉన్నదని, ఇందుకు ప్రభుత్వం తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. ‘విదేశాలను అనుసరించ కూడదు. అలా చేస్తే ఉన్నత విద్యలో మనం వెనుకబడిపోతాము. నయా సరళీకరణ విధానాలతో సమస్య ఉంటే అది దేశ ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఆహార స్వావలంబన, ఉపాధి, ప్రభుత్వ సాయంతో నడుస్తున్న విద్య, ఆరోగ్య రంగం మెరుగుదల, వృద్ధాప్య పెన్షన్లు వంటి వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాలి’ అని ప్రభాత్‌ సూచించారు. ‘బ్యాంక్‌ బచావో దేశ్‌ బచావో’ కన్వీనర్‌ సౌమ్య దత్తా మాట్లాడుతూ విలీనాలు లేదా ప్రైవేటీకరణ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల సామాన్యులు దోపిడీకి గురవుతారని చెప్పారు. దేశంలో శాస్త్ర, సాంకేతిక పరిశోధనలను సరిగా వినియోగించుకోవడం లేదని జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ సిద్ధార్ధ దత్తా అభిప్రాయపడ్డారు. చర్చా వేదికలో బెఫీ, బీఎస్‌ఎన్‌ఎల్‌యూ, డబ్ల్యూబీఎంఎస్‌ఆర్‌యూ వంటి సంస్థలతో పాటు యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.