చేరువైన ఓఆర్‌ఆర్‌ ఎంట్రెన్స్‌

– శంబిపూర్‌ వద్ద రూ.45 కోట్లతో ఇంటర్‌చేంజ్‌ ఏర్పాటు
– జిన్నారం పరిశ్రవ వర్గాలకు, ప్రజలకు, వ్యాపారులకు మరింత సౌకర్యం
నవతెలంగాణ-జిన్నారం
హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌కు సంబంధించి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజిపల్లి,బొల్లారం, మేడ్చల్‌ మల్కాజ్గిరి జిల్లా శంబిపూర్‌ మల్లంపేట్‌ వద్ద మరో ఇంటర్‌చేంజ్‌ ఏర్పాటయ్యింది. రూ.45 కోట్ల నిధులతో హెచ్‌ ఎండిఏ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ఇంటర్‌ చేంజ్‌ సౌకర్యంతో ఆయా ప్రాంతాలకు సంబంధించి రాకపోకల విషj ుంలో దూరభారం, రుసుం, సమయం ఆదా కానున్నదని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిన్నారం మండల పరిధిలో విస్తతంగా పరిశ్రమలు విస్తరించడం, పరిశ్రమల వర్గాలే కాకుండా వ్యాపార వర్గాలు, సాధారణ జనం వివిధ అవసరాలతో ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో గతంలో దుండిగల్‌, సుల్తాన్పూర్‌ కూడళ్ల మీదుగానే రాకపోకలు సాగించే పరిస్థితి ఉండేది. కాగా ప్రస్తుతం శంబిపూర్‌ వద్ద జిన్నారం మండలం బొల్లారం కాజిపల్లి సమీపంగా ప్రస్తుతం ఏర్పాటైన ఇంటర్‌ చేంజ్‌తో ఈ దూరభారం తగ్గనున్నది.