ఇంగ్లాండ్‌ అలవోకగా..!

England as a wave..!– బంగ్లాదేశ్‌పై బట్లర్‌సేన గెలుపు
–  శతకబాదిన డెవిడ్‌ మలాన్‌
ధర్మశాల (హిమాచల్‌ ప్రదేశ్‌) : డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లాండ్‌ ఎట్టకేలకు బజ్‌బాల్‌ ఆట బయటపెట్టింది. వార్మప్‌ మ్యాచులకు వరుణుడు ఆటంకం కలిగించగా, ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో పరాజయం చవిచూసింది. ఐసీసీ ప్రపంచకప్‌ గ్రూప్‌ దశ రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ అదరగొట్టింది. 137 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 364 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలుత ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (52, 59 బంతుల్లో 8 ఫోర్లు), డెవిడ్‌ మలాన్‌ (140, 107 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 115 పరుగుల అదిరే ఆరంభాన్ని అందించారు. అర్థ సెంచరీ అనంతరం బెయిర్‌స్టో అవుటైనా.. జో రూట్‌ (82, 68 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి మలాన్‌ జోరు కొనసాగించాడు. ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 బంతుల్లో అర్థ సెంచరీ బాదిన మలాన్‌.. 12 ఫోర్లు, రెండు సిక్సర్లతో 91 బంతుల్లో శతక విన్యాసం పూర్తి చేశాడు. జో రూట్‌ 44 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో అర్థ సెంచరీతో కదం తొక్కాడు. 107 బంతుల్లో 140 పరుగులు చేసిన డెవిడ్‌ మలాన్‌.. కెరీర్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. జోశ్‌ బట్లర్‌ (20), హ్యారీ బ్రూక్‌ (20) వేగంగా ఆడినా.. ఎంతోసేపు నిలువలేదు. చివర్లో పరుగుల వేట కాస్త నెమ్మదించినా.. ఇంగ్లాండ్‌ 9 వికెట్లకు 364 పరుగులు చేసింది. ఇక భారీ ఛేదనలో బంగ్లాదేశ్‌కు భంగపాటు తప్పలేదు. ఆ జట్టులో ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ (76, 66 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ముష్ఫీకర్‌ రహీమ్‌ (51, 64 బంతుల్లో 4 ఫోర్లు) అర్థ సెంచరీలు సాధించినా.. బంగ్లాదేశ్‌ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. హసన్‌ (1), నజ్ముల్‌ (0), షకిబ్‌ (1), మెహిది (8) విఫలమయ్యారు. 48.2 ఓవర్లలో 227 పరుగులకు బంగ్లాదేశ్‌ కథ ముగిసింది. 137 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్‌ గెలుపొందింది. డెవిడ్‌ మలాన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.