పాతికేళ్ల కుర్రాడు రాజకీయాల్లో పోటీ చేయకూడదా

– కేటీఆర్‌, కవిత ఏం అనుభవంతో బరిలో నిలిచారు
– రాజకీయ అజ్ఞాని మామిళ్ల ఆంజనేయులు
– కాంగ్రెస్‌ను విమర్శిస్తే ఊరుకునేది లేదు
– ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ నేతలు
నవతెలంగాణ-మెదక్‌
పాతికేళ్ల కుర్రాడు రాజకీయాల్లో పోటీ చేయకూడదా, కేటీఆర్‌, కవితలు ఏం అనుభవంతో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారని కాంగ్రెస్‌ నేతలు కొండన్‌ సురేందర్‌ గౌడ్‌, పవన్‌, జీవన్‌ రావు, గుందడి శేఖర్‌ పేర్కొన్నారు. మంగళవారం మెదక్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన మామిళ్ళ ఆంజనేయులు, కంటారెడ్డి తిరుపతి రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సమాజంలో గుర్తింపునిచ్చి పదవులను కట్టబెట్టిన కాంగ్రెస్‌ను పార్టీ వీడగానే తిట్టడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. మెదక్‌ కాంగ్రెస్‌ బరిలో ఉన్న మైనంపల్లి రోహిత్‌కు 25 ఏళ్ల వయస్సు లేదని, నియోజకవర్గంలోని గ్రామాలు తెలియవని, రాజకీయ అనుభవం లేదని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. అదష్టం, ప్రజల ఆదరణ ఉంటే పాతికేళ్ల కుర్రాడికి గెలిచే అవకాశాలు ఉన్నాయన్నారు. మనసులో ఒకటి, పైకి ఒకటి మాట్లాడే నైజం ఉన్న మామిళ్ళ ఆంజనేయులు ఓ రాజకీయ అజ్ఞాని అని తెలిపారు. కాంగ్రెస్‌ అంటే ఇష్టం లేకుంటే మరో పార్టీలోకి వెళ్ళాలి కానీ విమర్శించడం సరైన పద్దతి కాదన్నారు. హవెలిఘనపూర్‌ మడలం జక్కన్నపేట గ్రామం నుంచి మెదక్‌ వస్తే కాంగ్రెస్‌ ఆదరించడం జరిగిందన్నారు. పీసీసీలో పదవి ఇచ్చారని తెలిపారు. మెదక్‌లో మూడు సార్లు మున్సిపల్‌ ఛైర్మెన్‌గా పనిచేసిన బట్టి జగపతి కొడుకుపై కౌన్సిలర్‌గా గెలిచావంటే అది కాంగ్రెస్‌ ఘనతేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టిక్కెట్లు అమ్ముకుంటుందని ప్రచారం చేస్తున్నప్పుడు 15 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌లో ఎందుకు పనిచేశారని ప్రశ్నించారు. 15 ఏళ్లలో విజయశాంతి, ఉపేందర్‌ రెడ్డి లాంటి వారికి టిక్కెట్లు ఇచ్చినప్పుడు పార్టీ ఎందుకు మారలేదని ప్రశ్నించారు. గతంలో మెదక్‌ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి ఎలాంటి అభివద్ది చేయలేదంటున్నారనే విమర్శలు వాస్తవమే అని ఒప్పుకుంటున్నాం. కానీ మెదక్‌ నుంచి ప్రభుత్వ కార్యాలయాలు తరలిపోతుంటే ఏం చేశావని నిలదీశారు. కాంగ్రెస్‌ పార్టీ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను తిట్టిన వారి గురించి దేవేందర్‌ రెడ్డికి చాలా ఎక్కువ విషయాలు తెలుసని, అలాంటి వ్యక్తులను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి రెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి ఎక్కడి నుంచి వచ్చిందని, కాంట్రాక్టులు చేసి, డబ్బులు ఇచ్చి పదవులు తెచ్చుకున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు కోవర్ట్‌గా చేసిన విషయం అందరికి తెలుసని, అందుకే అధిష్టానం టిక్కెట్‌ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్‌ అనిల్‌ కుమారు, కండెల సాయిలు, ఐతారం నర్సింలు, నాయకులు మైపాల్‌, పోచయ్య, రాజు, భరత్‌ గౌడ్‌, శ్రీనివాస్‌ శివ తదితరులు ఉన్నారు.