అబద్ధాలు చెప్పటంలో అమిత్‌ షా దిట్ట

Amit Shah is good at telling lies– మంత్రి సత్యవతి రాథోడ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అసత్యాలు చెప్పటంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు మించిన వారు దేశంలో ఎవరూ లేరని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ విమర్శించారు. మంగళవారం అదిలాబాద్‌లో జరిగిన బీజేపీ జనగర్జన సభలో ఆయన అన్నీ అబద్దాలు చెప్పారని తెలిపారు. గిరిజన యూనివర్సిటీి ఏర్పాటుకు కేసీఆర్‌ ప్రభుత్వం స్థలం చూపించలేదని చెప్పటం మూర్ఖత్వమేనన్నారు. 2014 నుండి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అనేక పర్యాయాలు ప్రధాని మోడీని కలిసి డిమాండ్‌ చేసిన విషయం నిజం కాదా?అని ఆమె ప్రశ్నించారు. ములుగు జిల్లా జాకారంలో రాష్ట్ర ప్రభుత్వం 335ఎకరాల స్థలాన్ని కేటాయించిన ఫైళ్లను సీఎం కేంద్రానికి నివేదించిన విషయాన్ని గుర్తుచేశారు. గిరిజనుల రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే ఇన్నేళ్ళ్ల ఆమోదించకుండా తొక్కిపెడుతున్నదెవరో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. రూ.50 కోట్లతో కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జోడేఘాట్‌ నిర్మించామని తెలిపారు. గిరిజనుల ఓట్లు దండుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.