– ఆయన కుటుంబ, అవినీతి పార్టీ అధ్యక్షులు :మేధావుల సదస్సులో కేంద్ర మంత్రి అమిత్‌షా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కుటుంబ, అవినీతి పార్టీ అధ్యక్షుడు, మజ్లిస్ పార్టీలో ప్రభుత్వాన్ని నడుపుతున్న కేసీఆర్‌ను తమ పక్కలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోబెట్టుకోబోమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. కేటీఆర్‌ను సీఎం చేయడం, కవితను జైలుకెళ్లకుండా కాపాడుకోవడం పనిలో కేసీఆర్ ఉన్నారని చెప్పారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్లో మేధావులతో సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడారు. బీఆర్ఎస్కు సిద్ధాంతాల్లేవనీ, తమది సిద్ధాంతానికి అనుగుణంగా నడిచే పార్టీని అని చెప్పారు. కేసీఆర్ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని ఆరోపించారు. రానున్న ఐదేండ్లు మంచి పాలన ఎవరు ఇవ్వగలరో తెలంగాణ సమాజం ఆలోచించాలని కోరారు. కేసీఆర్ చెప్పిన నీళ్ళు, నిధులు, నియామకాల ఆకాంక్షలు నెరవేరలేదనీ, అందుకే బీజేపీకి ఓటేయాలని కోరుతున్నామన్నారు. కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులను అవినీతి మయంగా మార్చారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ది నిరోధక సర్కార్ ఉందనీ, ఫాంహౌస్, కుటుంబ రాజకీయాలతో తెలంగాణను ఏలుతున్నదని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితిలో రాష్ట్ర సర్కారు ఉందన్నారు. ఆదాయం పేరిట ఔటర్‌రింగ్‌రోడ్డును 30 ఏండ్లకు రూ.7,380 కోట్లకే ప్రయివేటు సంస్థకు ఇవ్వడం దారుణమన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదాయం కోసం మూడు నెలల ముందుగానే మద్యం టెండర్లు వేసిందని విమర్శించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో మేధావులు కీలక పాత్రపోషించారన్నారు. కళాకారులు తమ ఆటపాటల ప్రజల్ని చైతన్యపరిచారని గుర్తుచేశారు. మేధావులు, కళాకారులు మౌనం వీడి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తొమ్మిదేండ్ల పాలనలో మోడీ ప్రభుత్వం దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించిందనీ, ప్రపంచంలో ఐదో ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిందని చెప్పారు. సదస్సులో బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాష్ జవదేకర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్సీ ఎవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.