రాజ్యసభ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టుకు ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా

On suspension of Rajya Sabha AAP MP Raghav Chadha to the Supreme Courtనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాజ్యసభ నుంచి తనను సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎంపీ రాఘవ్‌ చద్దా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు మంగళ వారం సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాఘవ్‌ చద్దాపై నలుగురు ఎంపీలు ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 11న ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది. సభా హక్కుల కమిటీ దర్యాప్తు చేసి, నివేదిక ఇచ్చేంత వరకూ ఆయనపై సస్పెన్షన్‌ వేటు కొనసాగుతుందని రాజ్యసభ స్పష్టం చేసింది. దీనిని రాఘవ్‌ చద్దా సుప్రీంకోర్టులో తాజాగా సవాలు చేశారు. ఢిల్లీ బిల్లు ప్రతిపాదిత కమిటీలో తమను చేర్చారంటూ డిప్యూటీ చైర్మెన్‌ హరివంశ్‌కు నలుగురు ఎంపీలు గత పార్లమెంటు సమావేశాల్లో ఫిర్యాదు చేశారు. తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఎంపీలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చద్దాపై సస్పెన్షన్‌ వేటు వేయాలంటూ రాజ్యసభ పక్షనేత పీయూశ్‌ గోయల్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. ఇందుకు అధికార పక్షం సభ్యులు మద్దతు పలకడంతో రాఘవ్‌ చద్దాను సస్పెండ్‌ చేశారు. అయితే, దీనికి ముందు తనపై వచ్చిన ఫోర్జరీ ఆరోపణలను చద్దా ఖండించారు. కమిటీలో భాగం కావాలని తాను వారిని ఆహ్వానించానని, సంతకం ఫోర్జరీ జరగలేదని, అందువల్లే పార్లమెంటరీ బులిటెన్‌లో దీని గురించి ప్రస్తావించలేదని ఆయన చెప్పారు. కేవలం ప్రతిపక్షాల నోరు మూయించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. కాగా, రాజ్యసభలో హక్కుల కమిటీ నివేదిక ఇచ్చేంత వరకూ ఆప్‌ మరో ఎంపీ సంజరు సింగ్‌ సస్పెన్షన్‌ను కూడా పొడిగించారు.