– టీఎస్‌ఆర్టీసీ దసరా ఆఫర్
– విజయదశమి రోజు లక్కీ డ్రా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రజారవాణాను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణీకులకు లక్కీ డ్రా నిర్వహించాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుత దసరా సీజన్‌లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి లక్కీ డ్రా ద్వారా రూ.11 లక్షలు విలువైన బహుమతుల్ని అందిస్తామని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. దసరా సీజన్‌లో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పూర్తి పేరు, ఫోన్ నెంబర్ రాసి బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్‌బాక్స్‌ల్లో వేయాలని చెప్పారు. ఇటీవల రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇదే తరహాలో లక్కీడ్రా నిర్వహించి విజేతలను సత్కరించి బహుమతులు అందజేశామని వివరించారు. దసరా సీజన్‌లో కూడా లక్కీ డ్రా లో గెలుపొందిన 110 మంది విజేతల్లో ఒక్కొక్కరికి రూ.9,900 చొప్పున మొత్తం రూ.11 లక్షల బహుమతులు ఇస్తామన్నారు. విజయదశమి రోజు లక్కీ డ్రా తీసి, ప్రతి రీజియన్‌కు ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు చొప్పున ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ నెల 21 నుంచి 23 తేది వరకు, మళ్లీ 28 నుంచి 30 తేదీల్లో టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆయా తేదిల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణీకులు కూడా ఈ లక్కీ డ్రాకు అర్హులేనని తెలిపారు. ఇతర వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించారు. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణీకుల సౌకర్యార్థం 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు.