నవతెలంగాణ-తాడ్వాయి
వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో గిరిజనులకు జనాభా ప్రాతిపదికన 10శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగా ణకు గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసి దాని నిర్మాణానికి తొలివిడతగా సుమారు రూ.900 కోట్లు కేటాయించిన ప్రధానమంత్రికి గిరిజనుల తరపున, తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. బుధవారం ములుగు జిల్లా మేడారంలో కొలువైన వనదేవతలు సమ్మక్క, సారలమ్మను హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్‌రావుతో కలిసి కిషన్‌రెడ్డి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉపాధి అవకాశాల్లోనూ గిరిజన యువతీ యువకులకు ఈ రిజర్వేషన్లను అమలు చేస్తామని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు, వారి త్యాగాలను స్మరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ట్రైబల్ సర్క్యూట్ పేరుతో ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో రూ.25 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో గిరిజన స్మారక మ్యూజియం నిర్మాణం చేపట్టడంతో పాటు రూ.6.5 కోట్ల కేంద్ర నిధులతో గిరిజన పరిశోధనా సంస్థనూ ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. ములుగు జిల్లాలోని రుద్రేశ్వర ఆలయం (రామప్ప గుడి)కి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చే విషయంలోనూ ప్రధాని ప్రత్యేక చొరవతీసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో విద్యారంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.420 కోట్లతో 17 కొత్త ఏకలవ్య పాఠశాలలను కేంద్రం ఏర్పాటు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, గిరిజన మోర్ఛా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ, మాజీ మంత్రి, నాయకులు రాజునాయక్, అజ్మీర కృష్ణవేణి నాయక్, అజ్మీర ప్రహ్లాద్, నాయకులు మండల అధ్యక్షులు మల్లెల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.