– ఉపకార వేతనంపై అవగాహన కరువు
– హైదరాబాద్‌లో 292 ఉన్నత పాఠశాలలకు 18 స్కూళ్ల నుంచే అప్లికేషన్లు
– 12వేల మందికిపైగా విద్యార్థులకు 199 దరఖాస్తులే!
– అధికారుల నిర్లక్ష్యంతో ‘ఎన్‌ఎంఎంఎస్’కు విద్యార్థుల దూరం
– పరీక్షలో అర్హత సాధిస్తే.. నాలుగేండ్లపాటు రూ.12వేలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
జాతీయ ప్రతిభా ఉపకార వేతనం(నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్)కు ప్రచారం లేక.. విద్యార్థులకు కనీస అవగాహన ఉండటం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రతిభను వెలికితీయడం.. వారిని ఉన్నత విద్యకు ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభ ఉపకార వేతనాన్ని తీసుకొచ్చింది. కానీ ఈ పథకం గురించి విద్యార్థులకు అవగాహన లేకపోవడంతో దరఖాస్తు కూడా చేసుకోలేని పరిస్థితి. ప్రతిభ ఉండి, ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్ అందడం లేదు.
హైదరాబాద్ జిల్లాలో 870 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. అందులో 182 ఉన్నత పాఠశాలలు ఉండగా.. ఎయిడెడ్ 110 వరకు ఉన్నాయి. మొత్తం 292 ఉన్నత పాఠశాలల్లో ఎని మిదో తరగతిలో సుమారు 12,754 మంది విద్యార్థులు విద్యనభ్యసి స్తున్నారు. 2023-24 విద్యా సంవత్స రానికి జాతీయ ఉపకార వేతనాల కోసం 18 స్కూళ్ల నుంచి 199 విద్యార్థులు మాత్రమే ఇప్పటి వరకు దరఖాస్తు చేసు కోవడం గమ నార్హం. అత్య ల్పంగా దరఖా స్తులు రావడం, రెండ్రో జులు మాత్రమే సమయం ఉండ టంతో తాజాగా దరఖాస్తుల స్వీకరణ తేదీని ఈనెల 31 వరకు పొడి గిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలావుంటే 2022-23లో జిల్లా నుంచి 597 మంది విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష రాయగా.. సుమారు 250 మంది వరకు ఎంపి కయ్యారని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. వీరికి ఏడాదికి రూ.12,000 చొప్పున నాలుగేండ్లపాటు రూ.48 వేలు చెల్లిస్తారు. 9, 10, 11, 12వ తరగతి పూర్తయ్యే వరకు సదరు విద్యార్థికి ఉపకార వేతనం అందిస్తారు. ఏటా ఈ పరీక్షను రాస్తున్న విద్యార్థుల సంఖ్య పెరగకపోగా.. అంతకంతకు పడిపోతోంది.
ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ, ఓసీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనంగా నిలిచే ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ తగినంత ప్రచారం, అవగాహన కల్పించకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాసేలా ప్రోత్సహించాల్సి ఉంది.
గతేడాది నుంచి ఆధార్ కార్డు తప్పనిసరి చేయడంతోపాటు బ్యాంకు ఖాతాల విషయంలో నెలకొన్న సమస్యలతోనూ చాలా మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని కోల్పోతున్నారు. దానికితోడు ఈ ఏడాది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతులు, ఎస్‌ఏ 1 పరీక్షలు సమయంలోనే నోటిఫికేషన్ రావడంతో విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య తగ్గిందన్న వాదన వినిపిస్తోంది.
పరీక్ష విధానం ఇలా..
మొత్తం 180 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. మల్టీపుల్ చాయిస్ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 90 ప్రశ్నలు మానసిక సామర్థ్యానికి సంబంధించి, మరో 90 ప్రశ్నలు ఏడు, ఎనిమిదో తరగతుల గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాల నుంచి ఇస్తారు. ఈ పరీక్షలో ప్రతిభ చాటాలంటే విద్యార్థులు ఆయా అంశాలపై సన్నద్ధం కావాలి. ఇందుకోసం ఉపాధ్యాయులు పాఠశాలల్లో కొంత సమయాన్ని విద్యార్థులకు కేటాయిస్తే వారు విజయం సాధించగలరు. గతేడాది కన్నా ఈ ఏడాది మరింత ఎక్కువ మంది ఇందులో అర్హత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని విద్యారంగ నిపుణులు కోరుతున్నారు.
డిసెంబర్‌లో పరీక్ష..
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్)కు సంబంధించి ఈనెల 4వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించగా.. 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. గతేడాది ఏడో తరగతిలో 55 శాతం(ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50శాతం) మార్కులతో ఉత్తీర్ణత సాధించి ప్రస్తుతం 8వ తరగతి చదువుతూ ఉండాలి. వారి వార్షిక ఆదాయం రూ.1.50 లక్షల్లోపు ఉండాలి. పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ, స్టడీ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో దరఖాస్తులను అక్టోబర్ 31లోపు చేయాలి. దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో పరీక్ష నిర్వహిస్తారు.