ఈసీ కీలక నిర్ణయం

EC is a key decision  రాజస్థాన్‌ ఎన్నికల తేదీ 23 నుంచి 25కు మార్పు
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీల్లో మార్పు చేసింది. నవంబర్‌ 23న జరగాల్సిన పోలింగ్‌ తేదీని నవంబర్‌ 25కు మారుస్తూ బుధవారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలకు ఈ నెల 9న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిప్రకారం.. రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌ 23న జరగాల్సి ఉంది. ఇదేరోజు ఆ రాష్ట్రంలో దేవ్‌ ఉథాని ఏకాదశి. దాంతో ఆ రాష్ట్రంలో 50వేల కంటే ఎక్కువ వివాహాలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. దాంతో ఓటింగ్‌ శాతం తగ్గిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజస్థానీలు దేవ్‌ ఉథాని ఏకాదశి రోజున పెండ్లిళ్లు జరిపేందుకు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలోనే పోలింగ్‌ తేదీని మార్చాలంటూ పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల నుంచి ఈసీకి విజ్ఞప్తులు వచ్చాయి. అలాగే, రవాణా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో పాటు ఓటర్లు పోలింగ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉండొచ్చని.. అందువల్ల పోలింగ్‌ తేదీ మార్చాలంటూ మీడియా సంస్థల వేదికగా వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను నవంబర్‌ 25కి మార్పు చేస్తూ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది.