– పెండింగ్‌లో 3 లక్షలు ఆర్టీఐ ఫిర్యాదులు :నివేదికలో వెల్లడి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోని రాష్ట్ర సమాచార కమిషన్లు దుర్భర స్థితిలో ఉన్నాయి. 29 సమాచార కమిషన్లలో కనీసం నాలుగు పూర్తిగా పని చేయటం లేదు. తెలంగాణ, మిజోరాం, త్రిపుర, జార్ఖండ్‌లో సమాచార కమిషన్ లేదు. జార్ఖండ్‌లో గత మూడేండ్లుగా, త్రిపుర లో రెండేండ్లుగా కమిషన్ లేదు. సమాచార హక్కు చట్టం-2005కి సంబంధించి ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడానికి ప్రయత్నిస్తు న్న సతార్క్ నాగ్రిక్ సంగతన్ (ఎస్‌ఎన్‌ఎస్) సంస్థ ఈ మేరకు నివేదిక విడుదల చేసింది.అక్టోబర్ 3న ప్రధాన సమాచార కమిషనర్ పదవీ విరమణ చేయడంతో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్(సీఐసీ)తో సహా మరో ఆరు రాష్ట్ర కమిషన్‌లు ప్రస్తుతం తలలేనివిగా ఉన్నాయి. మణిపూర్ లో 56 నెలలుగా చీఫ్ లేకుండానే పనిచేస్తున్నది. చట్టంలో అలాంటి నిబంధన ఏదీ లేనప్పటికీ, మరో అధికారిని తాత్కాలిక కమిషనర్‌గా నియమించారు. ఛత్తీస్‌గఢ్ లో 2022 డిసెంబర్ నుంచి చీఫ్ లేకుండా పనిచేస్తోంది. మహారాష్ట్రలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి, బీహార్‌లో మే నుంచి, పంజాబ్‌లో గత నెల నుంచి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ లేకుండానే కమిషన్లు పని చేస్తున్నాయి.నివేదికను రూపొందించడంలో కీలక వ్యక్తి అంజలి భరద్వాజ్ మాట్లాడుతూ ”2014 నుంచి ప్రభుత్వం సమాచార కమిషనర్‌ను ఎన్నడూ నియమించలేదు. ‘ అని అన్నారు. ఎస్‌ఎన్‌ఎస్ కి చెందిన అమృతా జోహ్రీ మాట్లాడుతూ ”సమాచార కమిషన్లను నిర్వీర్యం చేయడం ,పౌరుడి ప్రాథమిక సమాచార హక్కును అణచివేయడానికి ఒక మార్గం. అప్పీల్ చేయడానికి ఎవరూ లేకపోవడంతో సమాచారం కోరే అప్లికేషన్‌కు అర్థం లేకుండా పోతుంది” అని అన్నారు.