రాష్ట్రానికి వంద కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు

100 companies of central armed forces per state– ఈనెల 20 నుంచి విధుల్లోకి..
– కొనసాగుతున్న పోలీసుల తనిఖీలు
– పట్టుబడుతున్న నగదు, ప్రలోభ వస్తువులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో జరిగే శాసనసభ ఎన్నికల్లో శాంతి భద్రతల పర్యవేక్షణకు వంద కంపెనీల సాయుధ బలగాలను తెలంగా ణకు కేటాయించినట్టు కేంద్ర ఎన్ని కల సంఘం రాష్ట్ర ప్రధానా ధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. ఈ బలగాలు 20వ తేదీ నుంచి విధుల్లో చేరతాయన్నారు. ప్రజల ఆస్తుల్ని ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటే సహిం చేది లేదనీ, కచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయివేటు ఆస్తులపై ప్రచార సామాగ్రి తొలగింపు కేసులు 7,322 నమోదయ్యా యని వివరించారు. అలాగే బుధవారం నుంచి గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.6 కోట్ల 27 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన అక్టోబర్‌ 9 నుంచి గురువారం వరకు మొత్తం రూ.20.43 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే అక్టోబర్‌ 11-12 తేదీల్లో రూ.31,36,048 లక్షలు విలువైన 19,317 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామనీ, ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు మొత్తం 31,739 లీటర్ల మద్యం, వెయ్యి కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నామనీ, వీటి విలువ రూ.86,92,533 ఉంటుందని వెల్లడించారు. అలాగే అక్టోబర్‌ 11-12 తేదీల్లో రూ.67,64,250 విలువైన 227కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామనీ, ఇప్పటి వరకు మొత్తం రూ.89 లక్షలు విలువైన 310 కిలోల గంజాయి స్వాధీనం అయినట్టు వివరించారు. అలాగే 11-12 తేదీల్లో పోలీసుల తనిఖీల్లో రూ.4 కోట్ల 89 లక్షలు విలువైన 24.257 కిలోల బంగారం, 16.1కిలోల వెండి, 42.203 క్యారెట్ల వజ్రాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అక్టోబర్‌ 9 నుంచి 12వ తేదీ వరకు మొత్తం రూ.14 కోట్ల 65 లక్షల బంగారం, వెండి, వజ్రాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. 7,040 కిలోల బియ్యం, 440 చీరలు, 80 కుట్టు యంత్రాలు, 87 కుక్కర్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నామనీ, వాటి విలువ రూ.7.86 లక్షలు ఉంటుందని తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన అక్టోబర్‌ 9 నుంచి ఇప్పటి వరకు మొత్తం స్వాధీనాల విలువ రూ.37.07 కోట్లుగా ఉందని వివరించారు. అలా గే రాష్ట్రంలో శాంతిభద్రతల్లో భాగంగా అంతరాష్ట్ర సరిహద్దుల్లో 89 కేసులు, ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో 169 కేసులు నమోదయ్యాయని తెలిపారు.